తీరు బాగుంటే... స్కోరు బాగుంటుంది!

How to achieve a perfect credit score - Sakshi

 సెక్యూర్డ్‌ రుణాలుంటే మరో లోన్‌ తేలికే

ఇష్టానుసారంగా క్రెడిట్‌ కార్డ్‌ వాడకండి

40% లోపు క్రెడిట్‌ వాడటమే ఉత్తమం

అవసరమైతే మరో కార్డ్‌కు దరఖాస్తు చేయండి

ఒకేసారి చాలా రుణాలకు దరఖాస్తు చేయొద్దు

ఇలాచేస్తే మీరు రిస్క్‌ కేటగిరీలో ఉన్నట్లే

క్రెడిట్‌ రిపోర్ట్‌ను క్రమం తప్పక చెక్‌ చేసుకోండి

ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవటం ముఖ్యం

ఈఎంఐ, క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ను కట్టకుంటే అంతే!  

ఒకప్పుడు దేశంలో చదువు ఉచితంగా చెప్పేవారు. ఏమీ ఆశించకుండా వైద్యాన్ని అందించేవారు. ఇప్పుడో..! అవి రెండూ చాలా కమర్షియల్‌ అయిపోయాయి. ఎంతలా అంటే... విద్య, వైద్యం అంటేనే ప్రజలు భయపడేంతలా!! వాటికయ్యే ఖర్చు అలాంటిది మరి. ఇప్పుడు రోజువారీ కుటుంబ ఖర్చులు కూడా వీటి సరసన చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు ఒక్కోసారి సరిపోకపోవచ్చు. అప్పుడు రుణం అవసరం పడుతుంది. అలాంటపుడు ఆ రుణమేదో కావాల్సినపుడు చేతికి అందాలి కదా? ఇలాంటప్పుడే క్రెడిట్‌ స్కోర్‌ కీలకం.

ఉదాహరణకు రాజేష్‌కు తన పిల్లల చదువుకు డబ్బులు అవసరమమ్యాయి. రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది రిజెక్ట్‌ అయ్యింది. ఇలాంటి సందర్భమే సంజయ్‌కి కూడా ఎద్దురయింది. మంచి ఇల్లు దొరకటంతో ఈయన ఇంటి రుణం కోసం అప్లై చేశాడు. రుణం రాలేదు. దీనికి కారణం... వారి క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉండటం.

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణ మంజూరీ అంశంలో వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వీటిలో వయసు, ఆదాయం, ఉద్యోగం, నివాస ప్రాంతం అనే వాటిని ప్రాథమికంగా చూస్తాయి. వీటి తర్వాత క్రెడిట్‌ స్కోర్‌ దగ్గరకొస్తాయి. వయసు, ఆదాయం, ఉద్యోగం వంటి విషయాల్లో మనం ఏమీ చేయలేకపోవచ్చు. కానీ మంచి క్రెడిట్‌ స్కోర్‌ను కలిగి ఉండటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అదెలానో చూద్దాం..

రుణాల్లో వైవిధ్యం తప్పనిసరి
రుణాల్లో వైవిధ్యాన్ని కలిగి ఉండాలి. అంటే అన్నీ పర్సనల్‌ లోన్ల వంటివే కాకుండా... వివిధ రకాల రుణాలను తీసుకోవాలి. సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ లోన్లను రెండింటినీ కలిగి ఉండొచ్చు. సాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సెక్యూర్డ్‌ లోన్స్‌ (గృహ రుణం వంటివి) కలిగిన వారికి వేరే రుణం ఇవ్వడానికి ప్రాధాన్యమిస్తాయి.

క్రెడిట్‌ బ్యూరోలు కూడా ఇలాంటి వారికే స్కోర్‌ ఇవ్వడానికి సానుకూలత చూపిస్తాయి. ఒకవేళ మీకు గనక అన్‌సెక్యూర్డ్‌ రుణాలు (పర్సనల్‌ లోన్, క్రెడిట్‌ కార్డు లోన్, ఎడ్యుకేషన్‌ లోన్‌ వంటివి) ఎక్కువగా ఉంటే ఆర్థిక సంస్థలు మీకు రుణమివ్వడానికి అంతగా ఇష్టపడవు. మీ లోన్‌ పోర్ట్‌ఫోలియోలో సెక్యూర్డ్‌ రుణాల వాటా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.

30–40 శాతం క్రెడిట్‌ వాడకం ఉత్తమం
క్రెడిట్‌ కార్డ్‌ ఉంది కదా అని ఇష్టానుసారంగా వాడేస్తుంటాం. అలా చేయడం మంచిది కాదు. మీకు క్రెడిట్‌ లిమిట్‌ రూ.3 లక్షలు ఉందనుకుంటే... ఈ నెల రూ.30,000 వినియోగించారు. అప్పుడు మీ క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి ఈ నెలకు 10 శాతం అవుతుంది. ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ వినియోగ నిష్పత్తి 30–40 శాతంలో ఉన్న వారికి రుణాలివ్వటానికి ముందుకు వస్తాయి. ఒకవేళ మీరు ఈ పరిమితిని దాటితే క్రెడిట్‌ బ్యూరోలు మీ క్రెడిట్‌ స్కోర్‌ను తగ్గిస్తాయి. అదే మీరు ఈ పరిమితిని తరుచుగా దాటేస్తుంటే... క్రెడిట్‌ పరిమితిని పెంచమనో లేదా వేరొక క్రెడిట్‌ కార్డు కోసమో దరఖాస్తు చేసుకోండి.

క్రెడిట్‌ రిపోర్ట్‌ పొందండి
క్రెడిట్‌ స్కోర్‌ను పెంచుకోవాలని భావిస్తే... ముందుగా మీరు మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను పొందండి. అందులో క్రెడిట్‌ స్కోర్‌ ఎంతుందో చూడండి. అప్పుడు మీరు ఎక్కడున్నారనే విషయం అర్థమవుతుంది. తర్వాత క్రెడిట్‌ స్కోర్‌ను పెంపొందించుకోవాలా? వద్ధా? అని ఆలోచించొచ్చు. క్రెడిట్‌ రిపోర్ట్‌లో కొన్నిసార్లు తప్పులు జరగొచ్చు. అలాంటివేమైనా ఉంటే సరిచేసుకోవచ్చు. అప్పుడు మీ క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.

ప్రస్తుతం మీరు రుణం తీసుకున్న సంస్థ, క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసిన కంపెనీ తదితరాల నుంచి మీ క్రెడిట్‌ బిహేవియర్‌ డేటాను క్రెడిట్‌ బ్యూరోలు రెగ్యులర్‌గా సేకరిస్తుంటాయి. దీని ఆధారంగా మీ క్రెడిట్‌ స్కోర్‌ను లెక్కిస్తాయి. ఒకవేళ మీరు రుణం తీసుకున్న సంస్థ కానీ, మీ క్రెడిట్‌ కార్డ్‌ జారీ కంపెనీ కానీ అందించే డేటాలో తప్పులుంటే ఆ ప్రభావం మీ క్రెడిట్‌ స్కోర్‌పై పడుతుంది. ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో సరిచూసుకోవడానికి క్రెడిట్‌ రిపోర్ట్‌ను నిశితంగా పరిశీలించాలి. అందుకోసం క్రెడి ట్‌ రిపోర్ట్‌ను అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి.     – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

ఒకేసారి ఎక్కువ రుణాలకు అప్లై చేయొద్దు
మీరు ఎప్పుడైనా రుణానికో, క్రెడిట్‌ కార్డుకో దరఖాస్తు చేసినప్పుడు బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ బ్యూరోల నుంచి మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను కోరతాయి. ఇలా మీరు చాలా సంస్థలకు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే... అప్పుడు క్రెడిట్‌ బ్యూరోలు వీటన్నింటికీ మీ క్రెడిట్‌ రిపోర్ట్‌లను పంపిస్తాయి.

అతితక్కువ కాలంలో చాలా రిపోర్ట్‌ల వల్ల క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్‌ బ్యూరోలు మీ స్కోర్‌ను కొన్ని పాయింట్లు తగ్గిస్తాయి. అలాగే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం రుణదాతకు తెలుస్తుంది. అప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మిమ్మల్ని రిస్క్‌ కేటగిరీలో పడేస్తాయి.

ఈఎంఐలు కచ్చితంగా చెల్లించాలి...
క్రెడిట్‌ బ్యూరోలు క్రెడిట్‌ స్కోర్‌ను ఏవిధంగా లెక్కిస్తాయో బయటకు వెల్లడించవు. కానీ చాలా మంది తీసుకున్న రుణాన్ని కచ్చితంగా కట్టేస్తే అప్పుడు మంచి స్కోర్‌ లభిస్తుందని విశ్వసిస్తారు. అందుకు మీరు కూడా మీ ఈఎంఐలను కచ్చితంగా కట్టేయండి. అలాగే క్రెడిట్‌ బ్యాలెన్స్‌ను కూడా పెండింగ్‌లో పెట్టకుండా చెల్లించండి.

అప్పుడు అధిక క్రెడిట్‌ స్కోర్‌ను పొందొచ్చు. చాలా మంది క్రెడిట్‌ కార్డ్‌ బ్యాలెన్స్‌ చెల్లించేటప్పుడు మినిమమ్‌ అమౌంట్‌ చెల్లిస్తూ ఉండొచ్చు. ఇలాచేస్తే మీరు అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అదేసమయంలో క్రెడిట్‌ స్కోర్‌ కూడా తగ్గుతుంది.

ఉచితంగా నాలుగు క్రెడిట్‌ రిపోర్ట్‌లు
4 సంస్థల నుంచి ఏడాదికి ఒకసారి... 
క్రెడిట్‌ స్కోరు 760 లేదా ఆపైన క్రెడిట్‌ కలిగిన వారికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.30 లక్షలు లేదా ఆపై గృహ రుణాలను ఎంసీఎల్‌ఆర్‌ రేటుకు అందిస్తోంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వారైతే 0.10 శాతం వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. నిజానికి మీకిప్పుడు రుణం అవసరం లేకపోవచ్చు.

కానీ మంచి క్రెడిట్‌ స్కోర్‌ భవిష్యత్‌లోనైనా పనికొస్తుంది. క్రెడిట్‌ స్కోర్‌ కోసం మీరేమీ చెల్లించాల్సిన పనిలేదు. ఆర్‌బీఐ 2017 జనవరి నుంచి అన్ని క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరోలూ ఏడాదిలో ఒకసారి ఎలాంటి చార్జీ లేకండా కస్టమర్ల అభ్యర్థన మేరకు పూర్తి క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఇవ్వాలని ఆదేశించింది.

క్రెడిట్‌ రిపోర్ట్‌ అంటే?
క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌లో (సీఐఆర్‌) మీ క్రెడిట్‌ హిస్టరీ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, ఈక్విఫాక్స్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్, ఎక్స్‌పీరియన్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్, క్రిఫ్‌ హై మార్క్‌ క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ అనే నాలుగు క్రెడిట్‌ ఇన్‌ఫర్మేషన్‌ కంపెనీలున్నాయి.

మీరు ఎప్పుడు రుణానికి దరఖాస్తు చేసుకున్నా.. ఆ బ్యాంక్‌ క్రెడిట్‌ బ్యూరో నుంచి మీ క్రెడిట్‌ రిపోర్ట్‌ను కోరుతుంది. ఇందులో మీ నెలవారీ చెల్లింపులు, ఇతర వివరాలుంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ 300–900 శ్రేణిలో ఉంటుంది. వివిధ క్రెడిట్‌ బ్యూరోలు అందించే స్కోర్‌లో స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు.

రిపోర్ట్‌ ఉచితంగా
మనం సాధారణంగా క్రెడిట్‌ రిపోర్ట్‌ కోసం కొంత చెల్లిస్తాం. అదే ఆన్‌లైన్‌లో పొందాలంటే పుట్టిన తేదీ, పాన్‌ నంబర్, ఈమెయిల్‌ అడ్రస్‌ వంటి వివరాలివ్వాలి. అయితే ప్రతి బ్యూరో నుంచి మనం ఏడాదికి ఒకసారి క్రెడిట్‌ రిపోర్ట్‌ను ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉచితంగా పొందొచ్చు.

క్రెడిట్‌ బ్యూరో వెబ్‌సైట్స్‌ నుంచి ఈ రిపోర్ట్‌ను తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఫిన్‌టెక్‌ సంస్థలు కూడా ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ అందిస్తామని పేర్కొంటుంటాయి. ఇవి క్రెడిట్‌ బ్యూరోలతో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ప్రతిగా కన్సూమర్‌ పేరు, కాంటాక్ట్‌ వివరాలు, ఉద్యోగ సమాచారం పొందుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top