భారత్‌లో పసిడి ధగధగలు..!

Gold prices today rise to 6-year high but silver edges lower - Sakshi

సెప్టెంబర్‌ త్రైమాసికంలో  డిమాండ్‌ 10 శాతం వృద్ధి డబ్ల్యూజీసీ నివేదిక

పండుగల సీజన్‌ అవుట్‌లుక్‌ అంతంతే!

ధరల పెరుగుదల ప్రధాన కారణం 

ముంబై: దేశంలో సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో  బంగారానికి  పటిష్ట డిమాండ్‌ నమోదయ్యింది. ఈ కాలంలో 10 శాతం వృద్ధి నమోదయినట్లు (2017 ఇదే కాలంతో పోల్చితే) వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. పరిమాణం రూపంలో 183.2 టన్నులు. అయితే ప్రస్తుత పండుగల సీజన్‌లో మాత్రం బంగారం డిమాండ్‌ అంతంతే ఉండవచ్చని డబ్ల్యూజీసీ అంచనావేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి ప్రధాన కారణమని విశ్లేషించింది. దీనితోపాటు దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సంబంధ సమస్యలూ ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. కౌన్సిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా) సోమసుందరం తెలిపిన ప్రధాన అంశాల్లో కొన్ని... 

►విలువ రూపంలో చూస్తే, సెప్టెంబర్‌ త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ 14 శాతం పెరిగి రూ.50,090 కోట్లకు చేరింది. 2017 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.43,800 కోట్లు. త్రైమాసికంలో ప్రారంభంలో పసిడి ధరలు పన్నులతో కలసి 10గ్రాములు దాదాపు 29,000 కు పడిపోయింది. డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణమిది. 
►ఇక రూపాయి పతనంతో ప్రస్తుతం ధరలు ఆరేళ్ల గరిష్ట స్థాయిలకు చేరాయి. 10 గ్రాములు పన్నుల కూడా లేకుండా ధర రూ.32,000–33,000 శ్రేణిలో తిరుగుతోంది. దీనితో మున్ముందు డిమాండ్‌ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిమాండ్‌ పరంగా చూస్తే, ప్రధాన కొనుగోళ్ల రాష్ట్రమైన కేరళ వరదలుసహా పలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుండటం ఇక్కడ గమనార్హం.  
►ఇక సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొత్తం ఆభరణాల డిమాండ్‌ 10 శాతం వృద్ధితో 134.8 టన్నుల నుంచి 148.8 టన్నులకు ఎగసింది. విలువ రూపంలో చూస్తే, 14 శాతం వృద్ధితో రూ.35,610 కోట్ల నుంచి రూ.40,690 కోట్లకు చేరింది.  
► ఇక సెప్టెంబర్‌ త్రైమాసికంలో  పెట్టుబడుల డిమాండ్‌ చూస్తే, 11 శాతం వృద్ధితో 31 టన్నుల నుంచి 34.4 టన్నులకు ఎగసింది. దీని విలువ మొత్తం రూ.8,200 కోట్ల నుంచి రూ.9,400 కోట్లకు చేరింది.  
►   కాగా పసిడి రీసైక్లింగ్‌ ప్రక్రియ పరిమాణం 13.85 శాతం తగ్గింది. 26.7 టన్నుల నుంచి 23 టన్నులకు చేరింది.  
► త్రైమాసికంలో పసిడి దిగుమతులు 55 శాతం పెరిగాయి. 173 టన్నుల నుంచి 269 టన్నులకు ఎగశాయి. త్రైమాసికం ప్రారంభంలో పసిడి ధర తగ్గడం దీనికి కారణం. 
►   బంగారం దిగుమతులు ప్రస్తుత  ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో  (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్‌ డాలర్లు.  ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ దీనికి నేపథ్యం.  
►    ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొంత పసిడి కొనుగోలు చేసింది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌ విదేశీ మారకపు నిల్వల్లో దాదాపు 20.23 బిలియన్‌ డాలర్ల పసిడి నిల్వలు ఉన్నాయి.  తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటిసారి. 
►  ఈ ఏడాది మొత్తంలో చూస్తే భారత్‌ పసిడి డిమాండ్‌ 700 నుంచి 800 టన్నుల శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం.   

అంతర్జాతీయంగా స్థిరం... 
కాగా అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థిరంగా ఉంది. కేవలం ఒక శాతం పెరుగుదలతో 958 టన్నుల నుంచి 964 టన్నులకు చేరింది. ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)ల అవుట్‌ఫ్లోస్‌ దీనికి ప్రధాన కారణం.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top