ఫోర్టిస్‌ రేసులో నాలుగు సంస్థలు

Fortis shortlists 4 entities for biz sale - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ కొనుగోలు రేసులో నాలుగు సంస్థలు  షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. తమ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి గల సంస్థలు మే 31 లోపు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (ఈఓఐ) దాఖలు చేయాలని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ పేర్కొనటంతో పలు కంపెనీలు స్పందించాయి. వీటిల్లో నాలుగింటిని షార్ట్‌లిస్ట్‌ చేశామని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ పేర్కొంది.

హీరో ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీస్‌– బర్మన్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ (డాబర్‌), ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్, రేడియంట్‌ లైఫ్‌ కేర్, మణిపాల్‌– టీపీజీ కన్సార్షియమ్‌లు నాలుగింటినీ తదుపరి బిడ్డింగ్‌ ప్రక్రియకు అనుమతించాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించినట్లు కంపెనీ తెలియజేసింది.

తాజా నిబంధనలు..
తాజా నిబంధనల ప్రకారం, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయాలనుకున్న ఏ కంపెనీ అయినా కనీసం రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌ కొనుగోలుకు సంబంధించిన సమగ్ర పెట్టుబడి ప్రణాళికను కూడా సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు డయాగ్నస్టిక్‌ విభాగం ఎస్‌ఆర్‌ఎల్‌ నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు నిష్క్రమించడానికి సంబంధించిన ప్రణాళికను కూడా జత చేయాల్సి ఉంటుంది.

గత వారం కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ను ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ పునర్వ్యవస్థీకరించింది. పాత  డైరెక్టర్లలో ఒకరైన బ్రియాన్‌ టెంపెస్ట్‌ను తొలగించాలని వాటాదారులు కోరారు. ఇద్దరు సంస్థాగత ఇన్వెస్టర్లు తొలగించాలని సూచించిన నలుగురు డైరెక్టర్లలో బ్రియాన్‌ టెంపెస్ట్‌ ఉన్నారు.

గత నెల 22న జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశానికి (ఈజీఎమ్‌) ముందే మరో ముగ్గురు డైరెక్టర్లు– హర్‌పాల్‌ సింగ్, సబీనా వైసోహ, తేజిందర్‌ సింగ్‌ షేర్గిల్‌ రాజీనామా చేశారు. ముం జాల్‌ బర్మన్‌ల ఆఫర్‌ను ఆమోదించిన డైరెక్టర్లలో ఈ నలుగురూ ఉన్నారు. వీరంతా వైదొలగడం, బోర్డ్‌ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ముంజాల్‌–బర్మన్‌ల ఆఫర్‌ను రద్దు చేసుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. దీంతో తాజా బిడ్డింగ్‌ మొదలైంది.

కంపెనీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన సంస్థలివీ..
1. హీరో ముంజాల్‌– బర్మన్‌
2. ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌
3. రేడియంట్‌ లైఫ్‌ కేర్‌
4. మణిపాల్‌– టీపీజీ కన్సార్షియమ్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top