ఫైనాన్షియల్‌ బేసిక్స్‌

ఫైనాన్షియల్‌ బేసిక్స్‌


స్టార్టప్స్‌ ఉద్యోగులకు

ఈసాప్స్‌ మంచివేనా?




ప్రస్తుతం చాలా భారతీయ స్టార్టప్‌ కంపెనీలు ఎంప్లాయి స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీ) ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సాధారణంగా ఇవి వేతన ప్యాకేజ్, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈఎస్‌ఓపీ ఆప్షన్‌ను ఆఫర్‌ చేస్తూ ఉంటాయి. ఉద్యోగులు వారి వేతనంలో నిర్ణీత మొత్తంతో వారు పనిచేసే సంస్థ షేర్లను కొనుగోలు చేయడానికి అంగీకరించడమే ఈఎస్‌ఓపీ అని ఒక్కమాటలో చెప్పొచ్చు. సంస్థలోనే పనిచేస్తున్నందున ఉద్యోగికి షేర్లు మార్కెట్‌ ధర కన్నా కొంత డిస్కౌంట్‌కు వస్తాయి. ఈ మేరకు సంస్థకు, ఉద్యోగికి నియామకం సమయంలోనే డీల్‌ కుదురుతుంది. అంటే కంపెనీ ఉద్యోగికి రూ.15 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేస్తోందనుకుంటే.. అందులో రూ.5 లక్షలను ఈఎస్‌ఓపీ రూపంలో ఇస్తోందనుకుందాం. అంటే ఈ రూ.5 లక్షల మొత్తానికి విలువైన కంపెనీ షేర్లు ఉద్యోగికి అలాట్‌ అవుతాయి. మిగతా రూ.10 లక్షల జీతం ఖాతాలో జమ అవుతుంది. మన పేరు మీది షేర్లను నిర్ణీత కాలం తర్వాత మాత్రమే విక్రయించుకోగలం. దీన్ని వెస్టింగ్‌ పీరియడ్‌గా పిలుస్తారు.



ఈ విధానం ఎవరికీ మేలు..

స్టార్టప్‌ కంపెనీ, ఉద్యోగి ఇరువురికి ఈఎస్‌ఓపీ ఆప్షన్‌ ఉత్తమమే. అయితే ఇక్కడ కొన్ని రిస్క్‌లు ఉంటాయి. ఈఎస్‌ఓపీ ఆప్షన్‌ ఎంచుకొని మిలియనీర్లు అయిన వారు ఉన్నారు. నష్టపోయిన వారు కూడా ఉన్నారు. పది స్టార్టప్‌లలో ఒకటి మాత్రమే విజయవంతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే మనం తీసుకునే రిస్క్‌ను బట్టి ఆప్షన్‌ ఎంచుకోవాలి. భారీ మొత్తంలో వేతనాలు చెల్లించకుండా మంచి టాలెంట్‌ను నియమించుకోవటానికి కంపెనీలకు ఈసాప్‌ విధానం అనువుగా ఉంటుంది. దీనికి గూగుల్‌ సుందర్‌ పిచాయ్‌ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే షేర్ల కేటాయింపు వల్ల ఉద్యోగి తను కూడా సంస్థలో భాగస్వామి అని భావించి మరింత బాగా పనిచేసే అవకాశముంటుంది. ఇది కూడా కంపెనీకి అనుకూలించే అంశమే. ఇదే సమయంలో ఈఎస్‌ఓపీ వల్ల కంపెనీ వ్యవస్థాపకుల షేర్‌ హోల్డింగ్‌ వాటా తగ్గుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు షేర్లు అలాట్‌ అవుతాయి కాబట్టి. చివరగా ఉద్యోగులు ఈఎస్‌ఓపీ ఆప్షన్‌ను ఎంచుకునేటప్పుడు పన్నులు, డాక్యుమెంటేషన్, ఎగ్జిట్‌ వంటి పలు అంశాలపై దృష్టిపెట్టాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top