
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం అమలు అనంతరం ఎగుమతిదారులకు లిక్విడిటీపరమైన సమస్యల నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం తర్వాత ఎగుమతులు క్షీణించాయి. అక్టోబర్‌లో 1.12% మేర తగ్గాయి. గతేడాది అక్టోబర్‌లో 23.36 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి గత నెలలో 23.09 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. చివరిసారిగా 2016 ఆగస్టులో ఎగుమతులు క్షీణించాయి.
టెక్స్‌టైల్స్, ఫార్మా, లెదర్, వజ్రాభరణాలు తదితర విభాగాల ఎగుమతులు కూడా క్షీణించాయి. గత నెల దిగుమతులు 7.6% వృద్ధితో 34.5 బిలియన్ డాలర్ల నుంచి 37.11 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు వెల్లువెత్తడంతో వాణిజ్య లోటు ఏకంగా మూడేళ్ల గరిష్టమైన 14 బిలియన్ డాలర్ల స్థాయికి ఎగిసింది. గతేడాది అక్టోబర్‌లో ఇది 11.13 బిలియన్ డాలర్లే.
గత నాలుగు నెలలుగా రీఫండ్‌లు లేకపోవడం, జీఎస్‌టీ చెల్లింపులతో తాము నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో పేర్కొంది. ఎగుమతులు మరింత క్షీణించకుండా సత్వరం చర్యలు తీసుకోవాలని, లేకపోతే నవంబర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగలదని తెలిపింది.
ఎగుమతి, దిగుమతుల డేటాను పరిశీలిస్తే..
♦ అక్టోబర్‌లో పసిడి దిగుమతులు మాత్రం 16 శాతం తగ్గి 2.94 బిలియన్ డాలర్లకే పరిమితం అయ్యాయి. చమురు దిగుమతులు 27.89 శాతం పెరిగి 9.28 బిలియన్ డాలర్లకు, చమురుయేతర దిగుమతులు 2 శాతం వృద్ధితో 27.83 బిలియన్ డాలర్లకు చేరాయి.
♦ పెట్రోలియం ఎగుమతులు 14.74%, ఇం జినీరింగ్ ఉత్పత్తులు 11.77%, రసాయనాల ఎగుమతులు 22.29% పెరిగాయి.
♦ 2017–18 ఏప్రిల్–అక్టోబర్ మధ్యలో మొత్తం ఎగుమతులు 9.62 శాతం పెరిగి 170.28 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 22.21 శాతం వృద్ధితో 256.43 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 86.14 బిలియన్ డాలర్లకు పెరిగింది.