మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయండి.. | Enforcement Directorate seeks revocation of Vijay Mallya's passport | Sakshi
Sakshi News home page

మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయండి..

Apr 14 2016 1:18 AM | Updated on Sep 5 2018 1:38 PM

మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయండి.. - Sakshi

మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేయండి..

బ్యాంకింగ్ బకాయిల కేసుల్లో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్ రద్దుచేసే ప్రక్రియను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్

విదేశాంగశాఖకు ఈడీ లేఖ
ఐడీబీఐ బ్యాంక్ రుణ అవకతవకల విచారణ నేపథ్యం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ బకాయిల కేసుల్లో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్ రద్దుచేసే ప్రక్రియను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ప్రారంభించింది. పాస్‌పోర్ట్ యాక్ట్, 1967 కింద ఈ మేరకు చర్యలు తీసుకోవాలని విదేశాంగమంత్రిత్వశాఖకు  లేఖ రాసింది. ముంబైలోని జోనల్ కార్యాయంలో పీఎంఎల్‌ఐ (అక్రమ ధనార్జనా చట్టం) కింద జరుగుతున్న క్రిమినల్ కేసుల విచారణలో ఏ మాత్రం సహకరించడంలేదని పేర్కొంటూ... మాల్యా డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఇక్కడి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్నీ ఈడీ కోరింది.

రూ.900 కోట్ల ఐడీబీఐ బ్యాంక్ రుణ మోసపూరిత వ్యవహారంపై ఈడీ విచారణ చేస్తోంది. రాజ్యసభ సభ్యునిగా  జారీ చేసిన డిప్లమేటిక్ పాస్‌పోర్ట్‌ను వినియోగించుకుని ఆయన మార్చి 2న బ్రిటన్‌కు వెళ్లినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం... డిప్లమాటిక్ పాస్‌పోర్ట్ జారీ సందర్భంలో సంబంధిత వ్యక్తి రెగ్యులర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ డాక్యుమెంట్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిప్లమేటిక్ పాస్‌పోర్ట్ రద్దయితే...  రెగ్యులర్ పాస్‌పోర్ట్ రద్దుకూ అది దారితీస్తుంది. తాజా ఈడీ చర్య నేపథ్యంలో... మాల్యా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నట్లు కనబడుతోంది.

 ఈడీ విజ్ఞప్తికి ఆమోదం పడితే...
ఈడీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం తమ విజ్ఞప్తికి ఆమోదం పడితే... ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ బ్రిటన్ అధికారులకు తెలియజేస్తుంది. అలాగే మాల్యాను దేశానికి పంపాలని కోరుతుంది. ఐడీబీఐ రూ.900 కోట్ల లోన్ డిఫాల్ట్ కేసులో విచారణకు రావాలని మూడుసార్లు (మార్చి 18, ఏప్రిల్ 2, ఏప్రిల్ 9) ఈడీ ముంబై విభాగం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ మూడు సార్లూ మాల్యా విచారణకు హాజరు కాలేదు. రుణ పరిష్కార అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, తాను ఇప్పుడే వీటిపై ఏమీ చేయలేనని మాల్యా నుంచి సమాధానం అందుతున్నట్లు ఈడీ పేర్కొంది.

తన లీగల్ టీమ్ సహకారంతో కేసు దర్యాప్తు జరపాలని మాల్యా కోరుతున్నట్లుందని, అయితే కేసు విచారణకు ఆయన తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. మాల్యా పాస్‌పోర్ట్ రద్దయితే.. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీని కోరుతూ ఈడీ తగిన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా... పట్టుకోడానికి రెడ్ కార్నర్ నోటీసునూ జారీ చేసే వెసులుబాటు ఏర్పడుతుంది. మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తుల సమాచారాన్ని  సేకరించే క్రమంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, తదితర దేశాలకు లెటర్స్ రొగటొరీస్(ఎల్‌ఆర్)ల జారీకి ఈడీ సిద్ధమవుతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి.

యూబీహెచ్‌ఎల్ క్లెయిమ్‌పై బ్యాంకింగ్ కౌంటర్
యూబీహెచ్‌ఎల్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై బ్యాంకింగ్ కన్సార్షియం బుధవారం కౌంటర్ అభ్యంతరాలను దాఖలు చేసింది.  తాను తనఖా పెట్టిన యునెటైడ్ స్పిరిట్స్   షేర్లను బ్యాంకులు తక్కువ ధరకు అమ్మేసి తనకు రూ.594 కోట్ల నష్టం వచ్చేలా చేశాయని, ఈ పరిహారాన్ని తనకు చెల్లించాలని ఇక్కడి డీఆర్‌టీలో యూబీహెచ్‌ఎల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే న్యాయప్రక్రియ జాప్యానికే కంపెనీ ఇటువంటి పిటిషన్లు వేస్తోందని కన్సార్షియం పేర్కొంది. వచ్చిన నష్టానికి తగిన ఆధారాలు, పత్రాలను కంపెనీ చూపాలని పేర్కొంది.  మరోవైపు తనకు రావాల్సిఉన్న దాదాపు రూ.535 కోట్ల బకాయిల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ మే 12, 13 తేదీల్లో ముంబై విమానాశ్రయంలో పార్క్‌చేసి ఉన్న మాల్యా ప్రైవేటు విమానాన్ని వేలం వేస్తోందని, దీనిపై వచ్చిన మొత్తాలను ‘అటాచ్’ చేయాలని కోరుతూ కూడా కన్సార్షియం ఒక పిటిషన్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణ 21కి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement