బ్యాంకులకు రుణాల చెల్లింపు ఎగనామం పెట్టిన కేసులో నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ముందు హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు.
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాల చెల్లింపు ఎగనామం పెట్టిన కేసులో నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ముందు హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు. మనీ లాండరింగ్ అభియోగాలతో నమోదు చేసిన కేసులో మార్చి 18న ఆయన వ్యక్తిగతంగా ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే శుక్రవారం విచారణకు హాజరు కాలేనని, ఏప్రిల్ వరకూ మాల్యా గడువు కోరినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఆ అభ్యర్థనపై ఈడీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, మాల్యాకు ఏప్రిల్ వరకూ గడువు ఇస్తారా, లేదా అనేదానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం మాల్యా విదేశాల్లో ఉన్న విషయం తెలిసిందే.
కాగా ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగవేసిన కేసుకు సంబంధించి విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించింది. మరోవైపు భారత బ్యాంకులకు 9,000 వేల కోట్ల రూపాయలను ఎగవేసిన కేసులో విజయ్ మాల్యా సిబీఐ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు విజయ్ మాల్యాకు నోటీసులు జారీ చేయడం, కేసు విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది. ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోతే ఆయన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాల్సిందిగా కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.