
భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిన సానుకూల పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చెప్పారు. 2016 సెప్టెంబర్‌లో ఆర్ బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక వార్తా సంస్థకు ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ఆర్థిక వృద్ధి తీరు, ద్రవ్యోల్బణం పరిస్థితులు, ద్రవ్య లభ్యత ధోరణులు సహా పలు ఆర్థిక అంశాలపై ఆయన మాట్లాడారు. గవర్నర్ ఏకపక్ష నిర్ణయం కాకుండా, ఆర్‌బీఐ కీలక రేట్ల నిర్ణయానికి ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీని (ఎంపీసీ) ఏర్పాటు చేసి కూడా ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు చూస్తే...
రుణ పాలసీని పటిష్టం చేయటమే లక్ష్యంగా గవర్నర్ నేతృత్వంలో ఎంపీసీ ఏర్పాటైంది... ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలని ఈ కమిటీ నిర్దేశించుకుంది. కానీ ద్రవ్యోల్బణం ఇప్పటికే
4 శాతానికి దగ్గరవుతోంది కదా?
ద్రవ్యోల్బణం భయాలున్న మాట విషయం నిజమే. అయితే వరుసగా మూడు త్రైమాసికాలు ద్రవ్యోల్బణం హద్దు దాటితే, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఎం దుకిలా జరుగుతోంది? తగ్గటానికి ఎలాంటి చర్యలు తీసుకోవా లి? అన్న అంశాలపై పరస్పర చర్చలు, అనంతరం కట్టడికి చర్యలు తీసుకోవాలి. అయితే నిర్దేశిత లక్ష్యం దాటకుండా ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇప్పుడు ఆరుగురు సభ్యుల ఎంపీసీ క్రియాశీలకంగా పనిచేస్తోంది. మరి ఇప్పటికీ మీరు పాలసీ ప్రకటనకు ముందు ఆర్థిక మంత్రితో సమావేశం కావాల్సిన పనేంటి?
నిజానికిదేమీ సంప్రదాయం కాదు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి కీలక సూక్ష్మ ఆర్థిక అంశాలపై పరస్పరం చర్చించుకుని, పటిష్ట బాటలో ఆయా అంశాలను నిలపడానికి ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి ఒక చక్కటి అవకాశమది. పలు దేశాల్లో ఈ తరహా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.
ద్రవ్యోల్బణం కట్టు తప్పకూడదన్న లక్ష్యంతో ఆర్‌బీఐ ఆర్థిక వృద్ధిని విస్మరిస్తోందా?
నిజానికి పాలసీకి ప్రాతిపదిక ప్రధానంగా వృద్ధి, ద్రవ్యోల్బణాలే. అయితే ఇక్కడ దేనికి ఎంత వెయిటేజ్ అన్నదానికి కచ్చితమైన కొలమానమేమీ లేదు. మనం ద్రవ్యోల్బ ణం లక్ష్యాన్ని నిర్దిష్టంగా 4 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యం కట్టు తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.
తద్వారా పటిష్ట వృద్ధి ఎలా సాధ్యమన్న అంశంపై ఆర్‌బీఐ ఉన్నతస్థాయి కమి టీ దృష్టి సారిస్తుంది. వృద్ధిని పూర్తిగా పక్కనపెట్టామనడం సరికాదు. వృద్ధి జరగాల్సిందే. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యాలను త్యాగం చేసి కాదు. ఆయా అంశాలకు సంబంధించి పారదర్శకమైన, సమగ్ర గణాంకాలపై ఆధారపడాలన్నది ఆర్‌బీఐ అభిప్రాయం. ఈ దిశలోనూ సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం.
ఇప్పడు భారత ఆర్థిక వ్యవస్థ పలు ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నోట్ల ర ద్దు, జీఎస్‌టీ వల్ల వ్యవస్థాగత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి పాలసీ రూపకల్పనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
అలాంటిదేమీ లేదు. ప్రతి అంశంపైనా సమతౌల్య భావన ఉంటుంది. అప్పటి గణాంకాల ప్రాతిపదికన నిర్ణయాలుంటాయి. జూన్ త్రైమాసికంలో వృద్ధి 5.7 శాతానికి పడిపోయింది. ఇక్కడ జీఎస్‌టీ అమలు ముందస్తు పరిస్థితిని మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
ఆయా అంశాల నేపథ్యంతో ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 6.7 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. అయితే మా ఉద్దేశం ప్రకారం ఆర్థిక వృద్ధి పునరుత్తేజం పొందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7 శాతం పైనే ఉంటుందని భావిస్తున్నాం. పలు ఆర్థిక సూచీలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఎంపీసీ పనితీరు ఎలా ఉంది?
ఎంపీసీ ప్రతిభావంతమైన వ్యవస్థ. మన ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు బయటివారు. అత్యున్నత స్థాయి విద్యావేత్తలు. ఆర్థిక పరిశోధనా నిపుణులుగా వారికి గౌరవముంది. కమిటీ పనితీరు ఎంతో బాగుందన్నది నా అభిప్రాయం. ఎంపీసీ కానీయండి లేదా జీఎస్‌టీ కౌన్సిల్ కానీయండి. ఆయా వ్యవస్థల ఏర్పాటు ఆర్థిక వృద్ధిలో కీలక అడుగులు.