దుమ్మురేపిన జుబిలంట్‌ ఫుడ్స్‌

Domino's operator, Jubilant FoodWorks, posts strong rise in Q1 profit  - Sakshi

మూడు రెట్లు పెరిగిన లాభం

న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ పేరుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. స్టోర్ల వారీ విక్రయాల్లో మంచి వృద్ధి ఉండడంతో లాభం మూడు రెట్లు దూసుకుపోయి రూ.74.67 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం కేలం రూ.23.84 కోట్లు. ప్రస్తుత స్టోర్ల వారీగా అమ్మకాల్లో వృద్ధి 25.9 శాతంగా ఉండడమే ఈ స్థాయి లాభాలకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం వృద్ధితో రూ.681 కోట్ల నుంచి రూ.862 కోట్లకు చేరింది. ‘‘అద్భుతమైన ఉత్పత్తులు, డబ్బుకు తగ్గ విలువను అందించడం, డిజిటల్‌ తోడ్పాటు వల్లే డామినోస్‌ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధ్యమైంది.

దీనికితోడు డంకిన్‌ డోనట్స్‌ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్రేక్‌ ఈవెన్‌ (లాభ, నష్ట రహిత స్థితి) దశకు తీసుకురావడంపై దృష్టి పెట్టినందున లాభాల వృద్ధి కొనసాగుతుంది’’ అని జుబిలంట్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ శ్యామ్‌ ఎస్‌ భర్తియా, కో చైర్మన్‌ హరి ఎస్‌ భర్తియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 1,144 డామినోస్‌ పిజ్జా అవుట్‌లెట్లను, 37 డంకిన్‌డోనట్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. జూన్‌ త్రైమాసికంలో కొత్తగా కంపెనీ 13 డామినోస్‌ పిజ్జా స్టోర్లను ప్రారంభించగా, మూడు చోట్ల దుకాణాలను మూసేసింది. డంకిన్‌ డోనట్స్‌ విషయంలో ఒకటి మూసేసి, మరో చోట ఇంకో స్టోర్‌ను తెరిచింది. ఫలితాల నేపథ్యంలో జుబిలంట్‌ స్టాక్‌ ఒకదశలో 3 శాతానికి పెరిగి రూ.1490ని చేరుకున్నా... చివరకు లాభాల స్వీకరణ కారణంగా 2.5 శాతం నష్టపోయి రూ.1,400 వద్ద క్లోజ్‌ అయింది.    
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top