డెక్కన్‌ క్రానికల్‌ ఆస్తుల అమ్మకం?

Deccan Chronicle sells property - Sakshi

ఈ నెల 17న తేలనున్న భవితవ్యం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ ఆస్తుల వేలం తప్పదా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే జరిగేట్టుంది. కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా శ్రేయి ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌కు చెందిన విజన్‌ ఇండియా ఫండ్‌ ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళిక (రిసొల్యూషన్‌ ప్లాన్‌)కు రుణదాతల నుంచి ఆమోద ముద్ర పడలేదు. శ్రేయి ప్రతిపాదనపై జరిగిన ఈ–ఓటింగ్‌లో రుణదాతల నుంచి 55 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. ప్రణాళిక ఆమోదం పొందాలంటే కనీసం 66 శాతం ఓట్లు రావాల్సిందే. శ్రేయి రూ.800 కోట్లకుపైగా ఆఫర్‌ చేసినట్టు సమాచారం. శ్రేయితోపాటు జీ గ్రూప్, టైమ్స్‌ గ్రూప్‌ బిడ్లను దాఖలు చేశాయి. అయితే పరిష్కార ప్రణాళిక కోసం రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన మొత్తం 357 రోజుల గడువు జూలై 10తో ముగిసింది. తదుపరి విచారణ జూలై 17న జరుగనుంది. ఈ సందర్భంగా ఎన్‌సీఎల్‌టీ ఏం చెబుతుందనేదే డీసీ భవిష్యత్తును నిర్దేశించనుంది.  

శ్రేయి రివైజ్డ్‌ ప్లాన్‌.. 
అయితే ఈ–ఓటింగ్‌ తర్వాత విజన్‌ ఇండియా ఫండ్‌ పాత ప్రతిపాదనకు మార్పులు చేస్తూ మరో ప్లాన్‌ను సమర్పించినట్టు  సమాచారం. కొత్త ప్లాన్‌ను పరిశీలించడమా లేదా అన్నది ఈ నెల 17న ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ తుది నిర్ణయం తీసుకోనుంది. పరిశీలించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ ఆదేశిస్తే కొత్త ప్రతిపాదనపై రుణదాతల కమిటీ తిరిగి చర్చిస్తుంది. ఈసారి రివైజ్డ్‌ ప్లాన్‌ను కమిటీ తిరస్కరిస్తే డెక్కన్‌ క్రానికల్‌ ఆస్తుల అమ్మకం తప్పదు. రిసొల్యూషన్‌ ప్లాన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఇప్పటికే తగినంత సమయం ఇచ్చిందని ప్రముఖ న్యాయవాది ఒకరు వ్యాఖ్యానించారు. 

అప్పుల మీద అప్పులు.. 
డెక్కన్‌ క్రానికల్‌ తమకు రూ.7,937 కోట్లు బకాయిపడిందని ప్రధాన రుణదాతలు క్లెయిమ్‌ చేస్తున్నారు. వీటితోపాటు రూ.3,044 కోట్లు చెల్లించాలంటూ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఆర్‌పీ)ను ఆశ్రయించారు. మమతా బినానీ డెక్కన్‌ క్రానికల్‌ ఆర్‌పీగా వ్యవహరిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.954 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకు రూ.808 కోట్లు, కెనరా బ్యాంకు రూ.723 కోట్లు, ఎల్‌ఐసీ రూ.464 కోట్లు, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్‌ రూ.340 కోట్లు, టాటా క్యాపిటల్‌ రూ.182 కోట్లు, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు రూ.72 కోట్లు డెక్కన్‌ క్రానికల్‌ బాకీ పడింది. 2017 జూలైలో దివాలా ప్రక్రియ మొదలైంది.  

లిక్విడేషన్‌ ఇలా.. 
కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా రిసొల్యూషన్‌ ప్లాన్‌కు ఆమోదముద్ర పడకపోతే లిక్విడేషన్‌ (ఆస్తుల అమ్మకం) చేపడతారు. లిక్విడేటార్‌ను ఇందుకోసం నియమిస్తారు. లిక్విడేటార్‌గా రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ను కొనసాగించాలా లేదా కొత్తవారిని నియమించాలా అన్నది రుణదాతల కమిటీ నిర్ణయిస్తుందని న్యాయవాది ఎస్‌.రాజశేఖర రావు తెలిపారు. తొలుత కంపెనీకి ఉన్న ఆస్తులను మదింపు చేస్తారు. వీటిని వేలం వేస్తున్నట్టుగా పత్రికల్లో ప్రకటన ఇస్తారు. అధిక మొత్తంలో బిడ్‌ దాఖలు చేసిన కంపెనీ/వ్యక్తులకు ఆ ఆస్తిని విక్రయిస్తారు. ఇలా అమ్మగా వచ్చిన మొత్తంలో ప్రాధాన్యత క్రమంలో తొలుత రిసొల్యూషన్, లిక్విడేషన్‌ ఖర్చులు, దివాళా కాబడ్డ కంపెనీలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు, సెక్యూర్డ్‌ క్రెడిటార్స్‌కు చెల్లిస్తారు. ఆ తర్వాత కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులకు, అన్‌సెక్యూర్డ్‌ క్రెడిటార్లకు, ప్రభుత్వ పన్నులు, ఇతర రుణదాతలు, షేర్‌హోల్డర్లకు చెల్లించాల్సి ఉంటుందని న్యాయవాది సాయి కిరణ్‌ పాటిల్‌ వెల్లడించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top