బ్రాండ్ ఇమేజ్కు ‘టాటా’

బ్రాండ్ ఇమేజ్కు ‘టాటా’


సాక్షి, బిజినెస్ విభాగం : టాటా గ్రూప్‌లో సంక్షోభానికి రతన్‌టాటా-సైరస్ మిస్త్రీల మధ్య ఏర్పడిన వ్యక్తిగత విబేధాలే కారణమన్నది మెల్లగా స్పష్టమవుతోంది. ఇంటిపేరు కూడా కలిసిన వారసుడు రతన్‌టాటా... గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుకు వారసుడు సైరస్ మిస్త్రీ... ఇద్దరిలో ఎవరూ కూడా వందేళ్ల టాటా గ్రూప్ ఇమేజ్‌ను పట్టించుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. కుటుంబ అధిపత్యం ఉన్న కార్పొరేట్ కంపెనీలు కూడా ఏ సీఈఓనూ, ఎండీనీ బయటకు పంపించని రీతిలో మిస్త్రీని టాటాలు అగౌరవ పరిచి ఉద్వాసన చెప్పారన్నది నిస్సందేహం. ఇక ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ డెరైక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో రతన్‌పై చేసిన తీవ్ర ఆరోపణలు గ్రూప్ స్థాయిని మరింత దిగజార్చాయి. రతన్- సైరస్ మిస్త్రీ ఇద్దరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే స్థితికి వచ్చేశారంటే వ్యక్తిగత విబేధాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు.


టాటా గ్రూప్ వెతలకు బాధ్యులెవరు?

ఇక్కడ గమనించాల్సిందొకటుంది. మిస్త్రీ లేఖలో చేసిన ఆరోపణల్లో వ్యక్తిగతమైనవి పక్కనబెడితే ప్రధానమైనది గ్రూప్ రుణభారం పెరిగిపోయిందనేది. కోరస్ స్టీల్ కొనుగోలు, ముంద్రా ప్రాజెక్టులో టాటా పవర్ పెట్టిన పెట్టుబడులు, ఇండియన్ హోటల్స్ విదేశాల్లో భారీ ధరకు కొన్న హోటళ్లు... వాటన్నిటితో రూ.1.18 లక్షల కోట్లు రైటాఫ్ చేయాల్సి ఉంటుందని మిస్త్రీ పేర్కొన్నారు. నిజానికివన్నీ రతన్ టాటా హయాంలో జరిగినవే. కానీ ఆ మూడు రంగాల పనితీరూ కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా బాగులేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు, ఆయా రంగాల వృద్ధి జోరుగా వున్నపుడు చేసిన టేకోవర్లు అవి.


ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాపారాలు బాగులేనపుడు... మిస్త్రీ వాటిని చక్కదిద్దలేకపోయారని నిందించటమూ సరికాదు. ఉక్కుకు డిమాండ్ లేనంత మాత్రాన మిట్టల్ ఉక్కు వ్యాపారాన్ని వదిలేశారా? అనిల్ అంబానీ, అదానీలు పవర్ వ్యాపారాన్ని అమ్ముకున్నారా? అలాంటిది  వందేళ్లుగా 100 రకాల వ్యాపారాన్ని చేస్తూ...ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న టాటా గ్రూప్ వీటిని వదిలించుకోవాల్సిన పనిలేదన్నది రతన్ వాదన కావొచ్చు. గ్రూప్ ప్రమోటర్లయిన టాటా ట్రస్టులు.. తన పనితీరునే ప్రామాణికంగా చూస్తున్నపుడు ఈ వ్యాపారాల నుంచి వైదొలిగి.. గ్రూప్ రుణభారాన్ని తగ్గించే ప్రయత్నా ల్ని చేయటం తప్పు కాదన్నది మిస్త్రీ మాట. ఈ లెక్కన గ్రూప్ వెతలకు ఇద్దరినీ బాధ్యులుగా చూడలేం.


 ఆ ‘తీరే’ ఇబ్బందికరం...

పనితీరు నచ్చనంత మాత్రాన ఏ కంపెనీ సీఈఓకూ హఠాత్తుగా ఉద్వాసన చెప్పరు. గౌరవంగా వైదొలిగే మార్గాన్ని కల్పిస్తారు. తాజా పరిణామాలు చూస్తే... మిస్త్రీ తీరు కొన్నాళ్లుగా రతన్ టాటాకు నచ్చకపోయి ఉండొచ్చు. కానీ తొలగింపు నిర్ణయం ఆకస్మికమేనని స్పష్టమవుతోంది. మిస్త్రీ తాజా లేఖ దీనికి అద్దం పడుతోంది. నిజానికి ఈ తొలగింపునకు రతన్ టాటాలో పెరిగిన వ్యక్తిగత విద్వేషమే కారణమై ఉండొచ్చని మిస్త్రీ లేఖ చెబుతోంది.


రతన్ టాటాపై ఆయన చేసిన వ్యక్తిగత ఆరోపణలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఇక టాటా సన్స్ బోర్డు సమావేశం జరుగుతున్నపుడు డెరైక్టర్లు బోర్డు రూమ్ నుంచి వెలుపలికి వెళ్లి రతన్ టాటాకు ఫోన్లు చేసేవారని, ఇవి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు దారితీస్తాయన్న తీవ్ర ఆరోపణను కూడా మిస్త్రీ సంధించారు. ఇవన్నీ వీరిద్దరి మధ్య ఉన్న అగాథాన్ని బయటపెట్టేవే. అ అగాథం సంగతెలా ఉన్నా... మిస్త్రీ లేఖతో కొంత మిస్టరీ వీడింది. బ్రాండ్ పరువు బజారులో పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top