వైరలవుతోన్న ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

Anand Mahindra Gets note From 11 Year Old Girl To Curb Noise Pollution - Sakshi

ముంబై : సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేసిన ఓ లెటర్‌ తెగ వైరలవుతోంది. ‘అలసటగా గడిచిన ఒకనాటి సాయంకాలం మీ మెయిల్‌కి ఇలాంటి ఒక లెటర్‌ వస్తే.. మీ అలసట పూర్తిగా మాయమవుతుంది. నేను కూడా తనలానే ఉన్నతమైన.. ప్రశాంతమైన ప్రపంచం గురించి ఆలోచించే వారికోసమే పని చేస్తుంటాను’ అనే క్యాప్షన్‌తో ఓ లెటర్‌ని ట్వీట్‌ చేశారు ఈ బిజినెస్‌  టైకూన్‌. ఈ లెటర్‌ని ముంబైకి చెందిన పదకొండేళ్ల మహికా మిశ్రా తన స్వహస్తాలతో రాసి ఆనంద్‌ మహీంద్రాకు మెయిల్‌ చేసింది.

లేఖలో ‘నాకు కార్లు, బైక్స్‌, లాంగ్‌డ్రైవ్‌ అంటే చాలా ఇష్టం. కానీ అవి పర్యావరణానికి ఎంత హానీ చేస్తాయో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ఇవి శక్తిని దుర్వినియోగం చేసి.. వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. దీన్ని నివారించడం కోసం మీకో ఐడియా ఇస్తున్నాను. అదేంటంటే 10 నిమిషాల వ్యవధిలో కేవలం 5 సార్లు మాత్రమే హారన్‌ రావాలి.. అది కూడా మూడు సెకన్ల పాటే మోగాలి. ఇలా చేస్తే వాయు కాలుష్యం తగ్గడమే కాక మన రోడ్లు కూడా చాలా ప్రశాంతంగా మారతాయి. ఇక మీదట మీ కంపెనీలో కార్లు తయారు చేసేటప్పుడు నా ఐడియాను  వినియోగించుకుంటే చాలా సంతోషిస్తాను. దాంతో పాటు వాతావరణాన్ని పాడు చేయని ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తే చూడాలని కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొంది.

ప్రస్తుతం ఈ లెటర్‌ వైరలవ్వడమే కాక నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. ఏడో తరగతి విద్యార్థిని నుంచి చాలా గొప్ప ఐడియా వచ్చింది.. ఉత్తమ ప్రపంచాన్ని కోరుకునే తనలాంటి వారిని ప్రోత్సాహించండి అంటూ మహికాను అభినందిస్తున్నారు నెటిజన్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top