యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్‌ వచ్చేస్తోంది...

Amazon may be mulling a rival to YouTube - Sakshi

సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. యూట్యూబ్‌లో రోజుకు కొన్ని కోట్ల సంఖ్య‌లో వీడియోల‌ను అప్‌లోడ్ చేయడం, అదే సంఖ్య‌లో వ్యూస్‌ రావడం చూస్తున్నాం. అయితే ఇక యూట్యూబ్‌కు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. యూట్యూబ్‌కు పోటీగా అమెజాన్ త్వరలో తన సొంత వీడియో షేరింగ్‌ సైటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. యూట్యూబ్ తరహాలో అమెజాన్ ట్యూబ్ సైట్‌ను అమెజాన్ డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. కాకపోతే ఈ సైట్‌లో వీడియో షేరింగ్‌తోపాటు యూజర్లు ఫొటోలు, టెక్ట్స్ మెసేజ్‌లు, డేటా, ఇతర సమాచారం కూడా షేర్ చేసుకునేందుకు వీలు కల్పించనున్నారని టెక్‌ వర్గాల ద్వారా తెలిసింది.

ఈ నెల మొదట్లో ట్రేడింగ్‌ మార్కుల కోసం యూఎస్‌ పేటెంట్‌, ట్రేడ్‌మార్కు ఆఫీసు వద్ద దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ వీడియో షేరింగ్ సైట్‌కు కేవలం అమెజాన్ ట్యూబ్ అని మాత్రమే కాకుండా ఓపెన్ ట్యూబ్, అలెక్సా ఓపెన్ ట్యూబ్, అమెజాన్ అలెక్సా ట్యూబ్, అమెజాన్ ఓపెన్ ట్యూబ్ అని పలు డొమెయిన్ నేమ్స్‌ను అమెజాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గూగుల్ సంస్థ ఇటీవలే అమెజాన్‌కు చెందిన టచ్‌స్క్రీన్ ఎకో డివైస్, ఫైర్ టీవీల నుంచి తన యూట్యూబ్ యాప్‌ను తొలగించింది. ఈ క్రమంలో గూగుల్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఆగ్రహానికి గురైన అమెజాన్ సొంతంగా యూట్యూబ్ తరహాలో ఓ సైట్‌ను తేవాలని నిశ్చయించుకుందని తెలిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top