అకౌంట్లతో పనిలేదు..

2 persant TDS on cash withdrawal over Rs 1 cr from multiple accounts - Sakshi

విత్‌డ్రాలు కోటి దాటితే 2% టీడీఎస్‌!

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ జూలై 5వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్‌లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్‌ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్‌’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్‌ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) విధించాలని జూలై 5 బడ్జెట్‌ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్‌డ్రాయెల్స్‌ చేస్తే 2 శాతం టీడీఎస్‌ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్‌లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్‌ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్‌ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్‌లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్‌ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్‌ ప్రతిపాదన కల్పిస్తోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top