‘నోట్ల రద్దు’ సమస్యను వెంటనే పరిష్కరించాలి
నల్లధనం వెలికితీత ప్రక్రియకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు చెప్పారు.
ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి
సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజలకు కష్టాలు
ప్రజలు కరెన్సీ కష్టాల్లో ఉండడంతో
‘ప్రత్యేక హోదా’పై పోరాటాన్ని వాయిదా వేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీత ప్రక్రియకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు చెప్పారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి గురువారం పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటనను వైఎస్సార్‌సీపీ స్వాగతించింది. నల్లధనం వెలికితీతను సమర్థిస్తున్నాం. అమలులోనే ఇబ్బందులున్నాయి. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని ఉన్నట్లుండి రద్దు చేసే సరికి ప్రజలకు నగదు కష్టాలు తప్పడం లేదు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. డెబిట్, క్రెడిట్ కార్డులు అందరి వద్ద లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం’’ అని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. నల్లధనం లేకుండా ఎలా చేస్తారు? ఇదంతా ఉండకూడదనే కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కష్టాల్లో ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదాపై తమ పోరాటాన్ని వాయిదా వేస్తున్నాం’’ అని మేకపాటి వివరించారు.
సామాన్యులను కష్టపెట్టొద్దు
‘‘నల్లధనాన్ని అరికడితే దేశానికి మంచి జరుగుతుందన్న సంతోషంలో ప్రజలు ఉన్నారు. మేం కూడా సమర్థిస్తున్నాం. కానీ, సామాన్యులను కష్టపెట్టడం సరికాదు.’’ అని పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ‘‘గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వేలో గ్రామీణ ప్రజలు ఎంతమేరకు పాల్గొన్నారు?’’ అని ప్రశ్నించారు.‘‘ఇప్పటివరకు నల్లధనాన్ని అరికట్టేందుకు ఏ ఒక్క కార్పొరేట్ సంస్థపైనా దాడులకు దిగలేదు. ఆర్‌బీఐని విశ్వాసంలోకి తీసుకోలేదు. ప్రణాళిక తయారీకి ఆర్‌బీఐ నూతన గవర్నర్‌కు తగిన సమయం ఇవ్వలేదనిపిస్తోంది. 2017లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నల్లధనం వెలికితీత ప్రక్రియకు రాజకీయ రంగు పులుముతున్నట్లుగా అనిపిస్తోంది.’’ అని వరప్రసాదరావు వెల్లడించారు. వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘సంసిద్ధత, ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ’’ అని అన్నారు.