అచ్చెన్నా... జర కళ్లుతెరువన్నా! | YSRCP Leaders Slams Kinjarapu Achennayudu | Sakshi
Sakshi News home page

అచ్చెన్నా... జర కళ్లుతెరువన్నా!

Aug 18 2014 11:49 AM | Updated on Jul 29 2019 5:25 PM

అచ్చెన్నా... జర కళ్లుతెరువన్నా! - Sakshi

అచ్చెన్నా... జర కళ్లుతెరువన్నా!

వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడంపై అమాత్యులు అంతెత్తున లేచారు. రౌడీ రాజకీయాలు వద్దంటే మంత్రిగారికి అంత కోపమెందుకో?

హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారట. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు చంద్రబాబు కొలువులో మంత్రిగిరి వెలగబెడుతున్న కింజరపు అచ్చెన్నాయుడు. టీడీపీ హత్యారాజకీయాలపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడంపై అమాత్యులు అంతెత్తున లేచారు. రౌడీ రాజకీయాలు వద్దంటే మంత్రిగారికి అంత కోపమెందుకో?

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో 11 మందిని అతి కిరాతకంగా చంపారని వైఎస్ఆర్ సీపీ చేసిన ఆరోపణలపై అచ్చెన్నాయుడు ఎదురుదాడికి దిగారు. శాంతిభద్రతలు కాపాడతామని చెప్పడం మానేసి పరిటాల రవి హత్యను మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ హయాంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కడెక్కడ జరిగాయో చెప్పాలంటూ వితండవాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ నేతలు ఎక్కడెక్కడ చనిపోయారని అడ్డగోలుగా ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు ప్రశ్నలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు దీటుగా సమాధానమిచ్చారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని సూచించారు. వంగవీటి రంగా హత్య దగ్గర నుంచీ చర్చకు సిద్ధమేనా అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. స్పీకర్ నియోజకవర్గంలో మైనార్టీ ఎమ్మెల్యే, తమ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం అప్పుడే మర్చిపోయారా అంటూ చురక అంటించారు. మహిళా ఎంపీటీసీలను జుట్టు పట్టుకుని లాక్కెళ్లిన విషయం గుర్తుకులేదా.

అంతెందుకు నిన్న కాక మొన్న కృష్ణా జిల్లాలో గొట్టుముక్కల ఉప సర్పంచ్ ఆలోకం కృష్ణారావును టీడీపీ కార్యకర్తలు కిరాతంగా హత్య చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కళ్లెదుటే ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం హత్యారాజకీయాలను ప్రోత్సహించడం దారుణమని వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కాదా అని హత్యారాజకీయాలు చేస్తే సహించబోమని టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. 'పచ్చ' ప్రభుత్వం ఇకనైనా హత్యారాజకీయాలు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement