కార్పొరేట్‌ దోపిడీకి కళ్లెం

YSRCP Give Free Education Fee Scheme To Poor People - Sakshi

 ప్రైవేట్, కార్పొరేట్‌లో రూ.25 వేల నుంచి  రూ.4 లక్షల వరకు ఫీజుల వసూళ్లు  

ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలు

జగన్‌ అధికారంలోకి వస్తే ఫీజులపై కమిషన్‌ ఏర్పాటు

పేద, మధ్య తరగతి పిల్ల లకు ఉచితంగా కార్పొరేట్‌ విద్యను అందించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర ప్రణాళిక రూపొందించారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో విద్య కాస్ట్‌లీగా మారింది. పిల్లల చదువుల కోసం ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఉద్యోగం వస్తే పిల్ల లు సంతోషంగా బతుకుతారన్న తల్లిదండ్రుల ఆశను చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నారు. మరో వైపు క్రమేణ  ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రేషన్‌లైజేషన్‌ పేరుతో జిల్లాలో 160కు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కార్పొరేట్‌ విద్య వ్యవస్థ దోపిడీకి కళ్లెం పడేలా చట్టం తేనున్నారు. 

నెల్లూరు (టౌన్‌):  కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఎల్‌కేజీకి రూ.25 వేల నుంచి ఇంటర్‌కు రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, రవీంద్రభారతి తదితర విద్యా సంస్థల్లో ఈ పరిస్థితి నెలకొంది.  ఇంజినీరింగ్‌కు కళాశాలను బట్టి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు దండుకుంటున్నారు. ఫీజులను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు కొమ్ము కాస్తుంది. ఎక్కువ సంస్థలు మంత్రి నారాయణ, శ్రీచైతన్యకు చెందినవే కావడంతో ప్రభుత్వం వారికి బహిరంగంగానే మద్దతు తెలుపుతోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో కార్పొరేట్‌ విద్యా సంస్థల ఫీజులను రెగ్యులేట్‌ చేసేలా కమిషన్‌ తీసుకవస్తామని   వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్‌ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్‌ చేసే విధంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. దీనిపై పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ విద్య వ్యవస్థపై మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నారు.

 కార్పొరేట్‌ దోపిడీ ఇలా..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,057 కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 160కు పైగా ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో కార్పొరేట్‌ పాఠశాలల్లో 1,64,482 మంది విద్యార్థులు చదువుతుండగా, కళాశాలల్లో 18 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఎల్‌కేజీకి రూ.25 వేల నుంచి రూ. 75 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే 10వ తరగతికి రూ.1.50 లక్షల వరకు తీసుకుంటున్నారు.

ఇంటర్మీడియట్‌కు ఐఐటీ, నీట్‌ల పేరుతో రూ.4 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌లో కళాశాల స్ధాయిని బట్టి రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు తీసుకుంటున్నారు.  ఎవరైనా ఫీజులపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరో వైపు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తుంది. గత ఏడాది రేషన్‌లైజేషన్‌ పేరుతో జిల్లా వ్యాప్తంగా 160కు పైగా స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది.

 ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
 ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టీచరు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో చదువుకు కుంటుపడుతుంది. సమయానికి పుస్తకాలు ఇవ్వకపోవడం, మధ్యాహ్న భోజన పథకానికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్ధితి ఆధ్వానంగా మారింది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరో వైపు పిల్లలను బడికి పంపిస్తే ఒక్కో పిల్లాడికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కార్పొరేట్‌ తరహాలో సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు టీచర్‌ పోస్టుల భర్తీ, పుస్తకాలు బడితెరిచే సమయానికి సిద్ధం చేసి ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top