
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రజా ‘సంకల్ప’ బలంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అడ్డంకులన్నీ అధిగమిస్తూ.. మొక్కవోని దీక్షతో కదంతొక్కుతున్నారు. మండే ఎండలైనా.. భారీ వర్షమైనా.. అనారోగ్యమైనా.. అడ్డంకులైనా ఏదైనా కానీ.. రాజీ లేదంటూ జనం బాట పడుతున్నారు. ప్రజలతో మమేకమై.. సమస్యలు వింటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. పేదల మోములో చిరునవ్వులు చిందించడమే తన ధ్యేయమని నిరూపిస్తున్నారు. తమ కోసం కష్టాన్ని సైతం లెక్కచేయని జననేత వెంట ప్రజలూ అడుగులేస్తున్నారు. అధికారపార్టీ వేధింపులనూ ఖాతరు చేయకుండా పాదయాత్రలో భాగస్వాములవుతున్నారు. ఎండనక, వాననకా.. ఆయన వెంట నడుస్తున్నారు. ‘మా భవిష్యత్తును మార్చే శక్తి జగన్.. రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ నినదిస్తున్నారు.
పాదయాత్ర సాగిందిలా..
వైఎస్ జగన్ పాదయాత్ర శనివారం నిడదవోలు నియోజకవర్గంలో సాగింది. ఉదయం 8.35 గంటలకు కానూరు క్రాస్ రోడ్డు నుంచి వైఎస్ జగన్ యాత్రను ప్రారంభించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు బ్రహ్మరథం పట్టారు. గ్రామీణులు రోడ్లపైకి చేరి గంటల తరబడి వైఎస్ జగన్ కోసం నిరీక్షించారు. ప్రతిగ్రామంలోనూ అభిమాన నేతకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. వృద్ధులు, చిన్నారులు, యువతులు వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో తమ బాధలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్ రోడ్డు, కలవచర్ల, డి.ముప్పవరం వరకూ యాత్ర కొనసాగింది. అక్కడ వైఎస్ జగన్ మధ్యాహ్న శిబిరానికి వెళ్లారు. అనంతరం సమిశ్రగూడెం మీదుగా నిడదవోలు వరకూ యాత్ర సాగింది.
చెక్కుచెదరని జనాభిమానం
సాయంత్రం నిడదవోలు గణేష్‌చౌక్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందే ఆకాశం మేఘావృతమైంది. జగన్ ప్రసంగం చివరిలో వాన పడినా ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ప్రజలు ఎటూ కదలకుండా జననేత ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ ఉండిపోయారు. ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ.. చేతులూపుతూ వైఎస్ జగన్ ప్రసంగానికి మద్దతు పలికారు. జననేత జగన్ జయహో అంటూ నినదించారు.
టీడీపీ సర్కారుపై ధ్వజం
టీడీపీ అవినీతి సర్కారుపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచే రాణీ రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన గడ్డ నిడదవోలు అని వైఎస్ జగన్ చెప్పగానే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారని జననేత ధ్వజమెత్తారు. ఆధారాలతో ఇసుక మాఫియా పట్టుబడినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.34వేల కోట్ల విలువైన ఇసుక, మట్టి దోచేశారని వైఎస్ జగన్ ఆరోపించారు.
తరలివచ్చిన పార్టీశ్రేణులు
పాదయాత్రకు పార్టీశ్రేణులు తరలివచ్చాయి. పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్లనాని, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాస్ నాయుడు, పార్టీ నేతలు జీఎస్ రావు, సమన్వయకర్తలు తెల్లం బాలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గుణ్ణం నాగబాబు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి రాజీవ్ కృష్ణ, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు పాతపాటి సర్రాజు, ఘంటా మురళీకృష్ణ, మద్దాల సునీత, పార్టీ నాయకులు కొఠారు రామచంద్రరావు, కవురు శ్రీనివాస్, గాదిరాజు సుబ్బరాజు, బూరుగుపల్లి సుబ్బారావు, కారుమంచి రమేష్, పొల్నాటి బాబ్జి, రెడ్డి అప్పలనాయుడు, గోలి శరత్‌రెడ్డి, ఎంఎస్‌ఎన్ రెడ్డి, దిరిశాల కృష్ణ శ్రీనివాస్, కమ్మ శివరామకృష్ణ, ఆలపాటి నరేంద్ర, ముళ్లపూడి శ్రీకృష్ణసత్య, అయినీడి పల్లారావు, మన్యం సూర్యనారాయణ, గజ్జరపు శ్రీరమేష్, మద్దాల ప్రభు, ముళ్లపూడి శ్రీనివాసకుమార్ చౌదరి, సత్తి వేణుమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జననేతతో కలిసి కొద్దిసేపు నడిచారు.