‘ఉల్లి’ లొల్లి.. | yields expected by the market, the prices of onion | Sakshi
Sakshi News home page

‘ఉల్లి’ లొల్లి..

Aug 21 2013 12:27 AM | Updated on Oct 16 2018 3:12 PM

ఉల్లి దిగుబడులు ఆశించిన మేర మార్కెట్‌లోకి రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి.

మెదక్, న్యూస్‌లైన్:ఉల్లి దిగుబడులు ఆశించిన మేర మార్కెట్‌లోకి రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. నాలుగు నెలల క్రితం కిలో ధర రూ.20 ఉండగా నేడు రూ.55 నుంచి రూ.60 వరకు చేరింది. దీంతో సామాన్యుని వంటింట్లో ఉల్లిగడ్డ బంగారమైంది. జిల్లాలో ఏటా సుమారు 90 వేల టన్నుల ఉల్లిని పండిస్తారు. కాగా హైబ్రిడ్ వేస్తే రెట్టింపు స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నారాయణఖేడ్, రేగోడ్, మనూర్, రాయికోడ్, సదాశివపేట, హత్నూర, కొండాపూర్, ములుగు, గజ్వేల్, కోహీర్ తదితర ప్రాంతాల్లో సుమారు 6 వేల హెక్టార్లలో ఉల్లిని పండిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా నల్లరేగడి నేలలే ఈ పంటకు అనుకూలం. దీంతో కేవలం రబీ సీజన్‌లోనే ఉల్లి సాగు చేస్తుంటారు. ఖరీఫ్ వచ్చేసరికి నీరు పుష్కలంగా ఉండటంతో వరి పంటకే రైతులంతా మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా 5 నెలలకు వచ్చే ఉల్లిపంట జూలై, ఆగస్టు నెలల్లో దొరకని వస్తువుగా మారింది. రబీలో వేసే ఉల్లి జిల్లా ప్రజల అవసరాలకు సరిపోను దిగుబడులు రాలేదు. దీనికితోడు ఉల్లిని నిల్వ చేసుకునే అవకాశాలు జిల్లాలో ఎక్కడా లేవు. కోల్డ్ స్టోరేజీల్లో మాత్రమే ఈ పంటను నిల్వ చేసే అవకాశం ఉంది.
 
 దీంతో నారాయణఖేడ్ ప్రాంతంలో సుమారు రూ.6 నుంచి 8 కోట్ల వ్యయంతో కోల్డ్‌స్టోరేజీల ఏర్పాటుకు ఉద్యాన శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మెదక్, సదాశివపేట ప్రాంతాల్లో తాత్కాలిక నిల్వల కోసం ఉల్లిగడ్డ నిల్వల కేంద్రాలను నిర్మించారు. 1999లో మెదక్‌లో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన నిల్వ కేంద్రాలు ఎన్నడూ ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. అవి వాడకుండానే శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడవి గాడిదలకు ఆవాసాలుగా, మరుగుదొడ్లుగా మారాయి. అధికారుల నిర్లక్ష ్యం కారణంగా విలువైన వస్తువులన్నీ దొంగలు ఎత్తుకుపోయారు. అయినా ఈ భవనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం కర్నూల్, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకుంటుండటంతో రోజు రోజుకూ ధరలు పెరిగిపోతున్నాయి. 
 
 ఉపయోగపడని ఉద్యాన శాఖ..
 లాభదాయకమైన కూరగాయలు, ఉద్యాన పంటలపై అవగాహన కల్పించేందుకు 1982లో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ శాఖ రైతులకు ఉపయోగపడడంలేదన్న విమర్శలున్నాయి. ఆ శాఖ అధికారులు కూరగాయల డిమాండ్.. దానికనుగుణంగా పంట కాలాన్ని రైతులకు వివరించాలి. కానీ సిబ్బంది కొరత ఆ శాఖకు శాపంగా మారింది. తాలూకా స్థాయిలో ఒక్కో ఏడీఏ స్థాయి అధికారి ఉంటే కొంతమేరకైనా రైతులకు సేవలందే అవకాశం ఉంది. కానీ జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు హార్టికల్చర్ అధికారులు, నలుగురు ఫీల్డ్ కన్సల్టెంట్లు మాత్రమే ఉన్నట్టు సమాచారం. పోస్టుల ఖాళీలు, ఉన్నవారిపై పనిభారంతో ఈ శాఖ పనితీరులో డీలాపడింది. ప్రభుత్వం స్పందించి ఉద్యాన శాఖలో ఉద్యోగుల కొరతను తీరిస్తే సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement