వర్షాఘాతం | Worse than the collapse of the groundwater | Sakshi
Sakshi News home page

వర్షాఘాతం

Aug 19 2014 2:16 AM | Updated on Oct 1 2018 2:03 PM

వర్షాఘాతం - Sakshi

వర్షాఘాతం

జిల్లాలో ముఖ్యంగా తూర్పుకృష్ణాలో భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో సైతం ఈ ప్రాంత ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

  • ఇంకిపోయిన చేతిపంపులు, బోర్లు
  •   పాతవాటి స్థానే కొత్త బోర్లు
  •   సాగునీటి ఎద్దడితో అనధికారికంగా మరో 3 వేల బోర్లు
  • జిల్లాలో ముఖ్యంగా తూర్పుకృష్ణాలో భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో సైతం ఈ ప్రాంత ప్రజలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బోర్లద్వారా సరిగా నీరు రాక, చేతిపంపులకు నీరందక ప్రజలు తాగునీటికి, సకాలంలో వర్షాలు కురవక రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
     
    జిల్లాలోని తూర్పు కృష్ణాలో గుక్కెడు మంచినీరు దొరకాలంటేనే గగనమైపోతుంది. ఈ ప్రాంతంలో బోర్ల వినియోగం నానాటికీ అధికమవుతుండడంతో భూగర్భజలాలు భారీస్థాయిలో పడిపోతున్నాయి. జిల్లాలో దాదాపు 78వేల వ్యవసాయం విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ఏడాది సాగునీటి ఎద్దడితో మరో 3వేల మంది అనధికారికంగా బోర్లను వేసుకున్నారని అధికారులు చెబుతున్నారు.

    ప్రతిఏటా  పంటకాలువల ద్వారా వచ్చేనీటితో 60శాతం, మిగిలిన 40శాతం వర్షాలు, బోర్లద్వారా వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురవ్వడంతో 70శాతంకు పైగా తూర్పు కృష్ణాలోని పామర్రు, పమిడిముక్కల, ఉయ్యూరు, మొవ్వ, ఘంటసాల, గుడివాడ, చల్లపల్లి, మోపిదేవి, మచిలీపట్నం మండలాల్లో ఎక్కువగా బోర్ల కింద నారుమళ్ళు, నాట్లు పనులు చేశారు.

    ఈ ఏడాది ఇప్పటికే 45వేల ఎకరాల్లో బోర్ల కింద  నాట్లు వేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 8వేల ఎకరాల్లో నారుమళ్లు పోశారు. ప్రతి ఏటా బోర్లకింద నారుమళ్లు మాత్రమే పోసి పంటకాలువలు, వర్షాల నీటితో నాట్లు వేసేవారు. ఈ ఏడాది వాటి ద్వారా నీరందక పోవడంతో బోర్లపైనే నాట్లువేశారు.
     
    వర్షపాతమూ తక్కువే...

    ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే 30 నుంచి 50 శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీనివల్ల ఈ కాలంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండి నీటిఎద్దడి సమస్యే ఉత్పన్నం కాదు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జిల్లాలో  సగటు వర్షపాతం దారుణంగా పడిపోయింది. జూన్‌లో 98మి.మీ సగటు వర్షపాతం కాగా కేవలం 28.1మి.మీ నమోదైంది. జూలైలో సగటు వర్షపాతం 210.6మి.మీ కాగా, 218.1నమోదై పరవాలేదనిపించింది. ఆగస్టులో 212.8మి.మీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికి సగం రోజులు పూర్తయినా కేవలం 48మి.మీ మాత్రమే నమోదైంది.
     
    బోర్లు, చేతిపంపులు మార్చేస్తున్నారు...
     
    ఘంటసాల, మొవ్వ, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నం, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో గతంలో వేసిన పలు బోర్లు, చేతిపంపుల నుంచి మంచినీటి ధార తగ్గిపోవడంతో పదేళ్ల నుంచి ఉన్న బోర్లు, చేతిపంపుల నుంచి నీరు రాకపోవడంతో వాటిని తొలగించి మరింత లోతుకు దించి వేసుకుంటున్నారు. దీనివల్ల ఒక్కొక్కరికీ రూ.2,000 నుంచి రూ.4,000 వరకూ ఖర్చులు అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పంచాయతీలు వేసిన చేతిపంపులు ధార తగ్గిపోవడంతో మహిళలు నీటికోసం ఎన్నోపాట్లు పడుతున్నారు.
     
    చల్లపల్లి : ‘‘ఘంటసాల మండలం కొడాలికి చెందిన వల్లారపు బాలకృష్ణ ఇంటి ఆవరణలో గతంలో తాగునీటి కోసం  వేసిన 100 అడుగుల చేతిపంపు ధార సరిగా రాకపోవడంతో శనివారం  పక్కనే మరో బోరు వేయించాడు’’.
     
     ‘‘ఘంటసాల మండలం తాడేపల్లి బీసీ కాలనీలో గతంలో వేసిన చేతిపంపు ధార పూర్తిగా తగ్గిపోవడంతో  బిందెడు నీరు పట్టుకోవడానికి పావుగంటపైనే సమయం పడుతుంది’’. వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు ఎండిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు దర్పణమిది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement