నిశ్శబ్ద రాజ్యంలో... నిత్య నరకం | Sakshi
Sakshi News home page

నిశ్శబ్ద రాజ్యంలో... నిత్య నరకం

Published Fri, Dec 1 2017 7:39 AM

World AIDS Day - Sakshi

పుట్టిన వాడు గిట్టక మానడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో పోయే ప్రాణంకోసం ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ మరణానికి సమీపంలో ఉన్నామనీ... బతకడానికి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందనీ తెలిసేవారి బతుకు ఎంత దయనీయం. ఊహించుకుంటేనే భయం కలుగుతోంది కదూ. తప్పు చేసి ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఓకే... కానీ ఏ తప్పూ చేయకున్నా... అలాంటి పరిస్థితి ఎదుర్కోవడం మరింత బాధాకరం. అలాంటి అభాగ్యులే హెచ్‌ఐవీ పీడితులు. ప్రపంచంలో సహజంగా వచ్చే అనేక వ్యాధులకు మందులు కనిపెట్టిన మన శాస్త్రవేత్తలు ఇంత వరకూ ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడే ఆయుధాన్ని సృష్టించలేకపోయారు. కనీసం చనిపోయేంత వరకైనా ప్రశాంత జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికున్నా తన కేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. మానవత్వం మరచిన వైద్యులు చికిత్సనందించకుండా తప్పించుకుంటుంటే, ప్రభుత్వం రిక్త హస్తాన్ని చూపించి నిత్య నరకాన్ని హెచ్‌ఐవీ రోగులకు అందిస్తోంది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్‌ఐవీ రోగుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేసింది. వారిని ఆదుకోవడానికి చర్యలు చేపడుతున్నామనే పాలకుల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదు. ఈ రోగులకు ప్రభుత్వం నెలకు రూ.1000ల పింఛన్‌ అందించాలి. కానీ ఈ సర్కారు పుణ్యమాని కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. 2012 తర్వాత ఒక్కరికి కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 5 వేలకు పైగా రోగులు పింఛన్ల కోసం ఎదురు చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పింఛన్లు రావాల్సి ఉంది. ఫలితంగా రాష్ట్రంలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారికి అందాల్సిన మందులు కూడా సకాలంలో అందడం లేదు. చికిత్స అసలే లేదు. దీనివల్ల జిల్లాలో ఈ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం విజయనగరం జిల్లాలో 10,687 మంది హెచ్‌ఐవీ రోగులున్నారని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

వ్యాధుల దాడి
హెచ్‌ఐవీ సోకితే రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. దీనివల్ల సహజంగా శరీరంలో ఉండే తెల్లరక్తకణాలు(రక్షక భటులు) చనిపోయి వ్యాధికారక క్రిములను, బాక్టీరియాలను అడ్డుకునే వ్యవస్థ నశిస్తుంది. ఫలితంగా అనేక వ్యాధులు అత్యంత సులభంగా సోకడంతో పాటు అవి మరింత ప్రాణాంతకమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి క్షయ, హెర్పిస్, కేన్సర్, చర్మ వ్యాధులు, డయేరియా వంటివి.

ఏఆర్‌టీ కేంద్రంలో మందుల కొరత
హెచ్‌ఐవీ రోగులకు ఏఆర్‌టీ కేంద్రంలో మందులు అందజేస్తారు. ఐసీటీసీ కేంద్రంలో హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన వెంటనే వారికి ఏఆర్‌టీ కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేసి జేఎల్‌ఎన్, టీఎల్‌ఈ మందులు అందజేస్తారు. ప్రస్తుతం ఏఆర్‌టీ కేంద్రంలో జేఎల్‌ఎన్‌ మందుల కొరత ఉంది. దాదాపు రెండు నెలలుగా ఈ రోగులకు మందులు లేవు. వీటిని క్రమం తప్పకుండా వాడకపోతే వ్యాధి తీవ్రత పెరుగుతుందనేది నిపుణుల అభిప్రాయం. రెండేళ్లుగా ఈ మందులు సరఫరా చేయడానికి సర్కారుకు చేతులు రావడంలేదు. అంతేనా... ఈ రోగులందరికీ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితంగా వైద్యం అందాల్సి ఉన్నా.. వైద్యులు ముందుకు రావడంలేదు. శస్త్రచికిత్సలు చేయాలంటే ఏదో ఒక కారణం చెప్పి రిఫరల్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సను బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేలకు గుంజుతున్నారు. 

హెచ్‌ఐవీ రోగులకు వైద్యం అందడం లేదు: 
హెచ్‌ఐవీ రోగుల పట్ల కనిపించని వివక్ష కొనసాగుతోంది. నేరుగా వైద్యం చేయబోమని చెప్పకుండా ఏదో కారణంతో కేజీహెచ్‌కు రిఫర్‌ చేసేస్తున్నారు. జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి దృష్టికి తీసుకెళ్తే కొందరు రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ప్రతీ కేసును ఆయన దృష్టికి తీసుకు వెళ్లలేం కదా.
– ఎం.పద్మావతి, విజయ పాజిటివ్‌ పీపుల్‌ సంస్థ అధ్యక్షురాలు, విజయనగరం.

హెచ్‌ఐవీ రోగులకు పింఛన్లు ఇవ్వాలి 
హెచ్‌ఐవీ రోగులకు 2012 తర్వాత పింఛన్లు మంజూరు కాలేదు. విజయనగరం జిల్లాలోనే 5 వేల మందివరకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. హెచ్‌ఐవీ రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు చేపట్టాలి. హెచ్‌ఐవీ బాధితులకు అంత్యోదయ కార్డుల ప్రక్రియ నిలిచిపోయింది. అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి.
– ఎన్‌.హరినాథ్‌రావు, విహాన్‌ సంస్థ ప్రతినిధి 

వివాహేతర సంబంధం వల్లే...
వివాహేతర సంబంధం వల్ల నాకు మూడేళ్ల క్రితమే హెచ్‌ఐవీ సోకింది. వ్యాధి వచ్చిందని తెలియగానే చనిపోవాలని అనిపించింది. భార్య, పిల్లలు అనాథలవుతారనే భయంతో ధైర్యం తెచ్చుకున్నాను. తప్పులు చేసి నాలా ఎవ్వరూ ఈ వ్యాధి బారిన పడవద్దు.
– రామారావు, హెచ్‌ఐవీ బాధితుడు, పార్వతీపురం

నా భర్త ద్వారా నాకు...
మా ఆయనకు ముందు హెచ్‌ఐవీ వచ్చింది. ఆ తర్వాత నాకు వచ్చింది. ఎనిమిదేళ్లనుంచి దీనికోసం మందులు వాడుతున్నాను. ఇప్పటికైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు  రాలేదు. ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పుడు కాస్త ఆరోగ్యం బాగోలేదు. వికారంగా ఉంటోంది. ఈ వ్యాధి సోకిందని తెలియగానే బెంగగా అనిపించింది. ఏఆర్‌టీ కౌన్సిలర్లు కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల బెంగ తీరింది. పూర్తిగా తగ్గిపోతే బాగుండనిపిస్తోంది.
– రామలక్ష్మి, హెచ్‌ఐవీ బాధితురాలు, బొబ్బిలి

ఏ తప్పు చేయకపోయినా...
ఎటువంటి తప్పు చేయకపోయినా నాకు హెచ్‌ఐవీ వచ్చిం ది. జ్వరం వచ్చిందని గ్రామంలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద ఇంజక్షన్‌ చేయించుకున్నాను. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కేంద్రాస్పత్రికి వెళితే అక్కడ పరీక్షించి హెచ్‌ఐవీ ఉందని చెప్పారు. 13 ఏళ్లుగా మనోవ్యధ చెందుతున్నాను. ఎందుకు ఈ జన్మ అనిపించింది. కాని నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కోసమైనా జీవించాలనిపిస్తోంది. 
– రమణ, హెచ్‌ఐవీ బాధితుడు, గుర్ల మండలం.

Advertisement
 
Advertisement