ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.
గవర్నర్‌కు వివరించిన స్పీకర్ కోడెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకోసం కేటాయించిన ప్రస్తుత పాత అసెంబ్లీ భవనంలోనే కార్యకలాపాలు నిర్వహించుకుంటామని వివరించారు. గురువారం ఇరు రాష్ట్రాల స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు శాసనమండలితోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా జూబ్లీహాలులో నిర్వహించుకోవాలని, తద్వారా ఆయా రాష్ట్రాల ఉభయ సభలు వేర్వేరు ప్రాంగణాల్లో ఉన్నట్లవుతుందని, ఫలితంగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి సూచించడం తెలిసిందే. దీనిపైనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు గవర్నర్‌ను కలసి పాత భవనంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగించేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.