రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు బాసటగా ‘అనంత’లో ఆ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలు మంగళవారం రెండో రోజూ కొనసాగాయి.
సాక్షి, అనంతపురం : రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు బాసటగా ‘అనంత’లో ఆ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలు మంగళవారం రెండో రోజూ కొనసాగాయి. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష కొనసాగించారు. ధర్మవరంలో పార్టీ సమన్వయకర్త తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గం, గుడిబండ, పెనుకొండ, గుంతకల్లు, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రాప్తాడు, గార్లదిన్నె, పుట్లూరు, నార్పల, యల్లనూరు, ఉరవకొండ, ఉండబండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలేదీక్షలు ప్రారంభించారు.
ఆయా చోట్ల దీక్షల్లో కాపు భారతి, పైలా నర్సింహయ్య, డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ సమ న్యాయం కోసం వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజాదరణ ఏమాత్రం లేని దిగ్విజయ్‌సింగ్, ఆంటోని, చిందంబరం చెప్పిన మాటలు విని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు కుట్రపన్నిందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోని సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న స్వార్థ బుద్ధితోనే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. ఓట్లు.. సీట్లు చూసుకున్నారే కానీ.. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేకపోయారని విమర్శించారు.
ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్ర విభజన ఎవరికోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. నేడు ఏముఖం పెట్టుకుని రాష్ట్రంలో బస చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిజమైన సమైక్య వాది అయితే.. జై సమైక్యాంధ్ర అని నినదించగలరా అని సవాల్ విసిరారు.
కేసీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల్లో ఆందోళన కల్గించాయన్నారు. అయితే వీటిపై ఇంత వరకు కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైన నిర్ణయం వెలువరించకపోవడం చూస్తే.. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులపై వాటికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో చరిత్ర హీనురాలిగా మిగిలిపోతారని హెచ్చరించారు.