వరాల వెలిగొండ..!

Veligonda Project Special Story Over YS Jagan Visit - Sakshi

సాక్షి, ఒంగోలు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా వరప్రదాయని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అత్యధికంగా నిధులు కేటాయించి పనులు వేగంగా చేయించగలిగారు. 2005 నుంచి 2009 వరకు రిజర్వాయర్, కాలువలు, పైపులైన్ల నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చారు. అయితే 2009 సెప్టెంబర్‌ 2న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందడంతో వెలిగొండ పనులకు గ్రణం పట్టినట్‌లైంది.

టీడీపీ పాలనలో నత్తనడకన.. 
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వెలిగొండ నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ధనార్జనే ధ్యేయంగా వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను వాడుకున్నారు. గతంలో రెండో టన్నెల్‌ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి అంచనాలు విపరీతంగా పెంచి తన బినామీ, అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థ«కు అప్పగించారు. అయినా ఆ సంస్థ పనులను సక్రమంగా చేయలేదు. అంచనాలు పెంచి ప్రజాధానాన్ని లూటీ చేయాలని వేసిన పన్నాగం తర్వాత అధికారం కోల్పోవడంతో బెడిసి కొట్టింది.

కాలువల వివరాలు ఇవే.. 

 • తీగలేరు ప్రధాన కాలువ బి. చెర్లోపల్లి వద్ద నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రారంభమై ప్రకాశం జిల్లాలోని 5 మండలాల్లో 62వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడానికి రూపొందించారు. ఈ కాలువ 12.80 మీటర్ల వెడల్పుతో 48.3 కిలో మీటర్ల పొడవుతో త్రిపురాంతకం వద్ద ముగుస్తుంది.  
 • గొట్టిపడియ ప్రధాన కాలువ జమ్మనపాలెం వద్ద గొట్టిపడియ కట్టడం నుంచి జిల్లాలోని రెండు మండలాల్లో 9500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. ఈ కాలువ 6.9 మీటర్ల వెడల్పుతో 11.435 కిలోమీటర్ల పొడవుతో గుండ్లకమ్మ వాగు వద్ద ముగుస్తుంది. 
 • తూర్పు ప్రధాన కాలువ కాకర్ల వద్ద నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ప్రారంభమై జిల్లాలోని 15 మండలాలు, నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో కలిపి 2,45,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించనుంది. అదే విధంగా కంభం చెరువు కింద 6,500 ఎకరాల ఆయకట్టు భూమి స్థిరీకరించడానికి కూడా రూపొందించారు. కాలువ 15.50 మీటర్ల వెడల్పుతో 130.66 కిలోమీటర్ల పొడవుతో నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద ముగుస్తుంది.  
 • పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, ఉదయగిరి ఉపకాలువ రిజర్వాయర్‌ నిర్మించనున్న పెద్దిరెడ్డిపల్లి గ్రామం వద్ద తూర్పు ప్రధాన కాలువ చివరి భాగాన 2.02 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్‌ నుంచి 39.966 కిలోమీటర్ల మేర ఉదయగిరి ఉప కాలువ తవ్వడం ద్వారా నెల్లూరు జిల్లాలోని నాలుగు మండలాల్లో 52వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, గండిపాలెం రిజర్వాయర్‌ కింద సాగు చేస్తున్న 6500 ఎకరాలు స్థిరీకరించడానికి ఉద్దేశించారు.  
 • పశ్చిమ ఉప కాలువ, తూర్పు ప్రధాన కాలువ నుంచి 25.45 కిలోమీటర్‌ వద్ద ప్రారంభమై 5 ఎత్తిపోతల ద్వారా 23.68 కిలోమీటర్ల పొడవుతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 60,300 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రూపొందించారు.  
 • తురిమెళ్ల రిజర్వాయర్‌లో 2.453 టీఎంసీల సామర్థ్యంతో తురిమెళ్ల గ్రామం వద్ద నిర్మిస్తారు. 3.1 కిలోమీటర్ల దూరం నుంచి పడమర ఉప కాలువ ప్రారంభమై 6.7 కిలోమీటర్ల దూరం వరకు ప్రవహించిన తర్వాత దీని నుంచి రెండో ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా 3,4,5 ఎత్తిపోతల పథకాల నిర్మాణం కూడా కొంతమేర జరిగాయి.  
 • నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం గ్రామం వద్ద నిర్మించతలపెట్టిన సీతారామసాగర్‌ జలాశయం 1.0 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. దాని ద్వారా మండలంలోని 7500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించారు.  
 • రాళ్ళవాగు జలాశయం, గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయాలు కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోనే ఉన్నాయి. రాళ్లవాగు జలాశయం 0.138 టీఎంసీల సామర్థ్యంతో రాళ్లపాడు గ్రామం వద్ద నిర్మించనున్నారు. దీని ద్వారా ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు గ్రామంలో 1500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు. 
 • గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయం 0.415 టీఎంసీల సామర్థ్యం కలిగి గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద గుండ్లకమ్మ వాగుమీద నిర్మించి ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో 3,500 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రతిపాదించారు.  

పూర్తయితే 4,47,300  ఎకరాలకు సాగునీరు  

ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా వెలిగొండ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణమ్మ వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించే విధంగా రూపొందించారు. ప్రకాశం జిల్లాలో 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్‌ తయారు చేశారు.  

కొల్లంవాగు నుంచి హెడ్‌రెగ్యులేటర్‌  
శ్రీశైలం జలాశయం నీటి మట్టం 256.032 మీటర్లు ఉన్నప్పుడు జలాశయం అంతర్భాగంలో కలుస్తున్న కొల్లంవాగులోకి నీరు వచ్చి చేరుతుంది. కొల్లంవాగు జన్మస్థలం నుంచి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్, సొరంగాలు, వరద కాలువ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ను నింపాల్సి ఉంది. నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 43.58 టీఎంసీలు. కొల్లంవాగు జన్మస్థలం వద్ద 328 క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్‌ రెగ్యులేటర్‌ను నిర్మించ తలపెట్టారు. ఈ నిర్మాణం రాజీవ్‌ పులుల అటవీ సంరక్షణ కేంద్రం పరిధిలో ఉంది. హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి రెండు సొరంగాల ద్వారా నీటిని నల్లమల కొండల్లోని నల్లమలసాగర్‌ రిజర్వాయర్‌కు చేరడానికి సుమారు 19 కిలోమీటర్ల మేర నీరు ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు సొరంగాలు ఒక్కొక్కటి 19 కిలో మీటర్ల మేర కొండలను తొలిచి 
నిర్మిస్తున్నారు. 

నల్లమల సాగర్‌ జలాశయం  
నల్లమల అటవీ ప్రాంతంలోని కొండల మధ్య సహజ సిద్ధంగా నల్లమలసాగర్‌ ఏర్పడింది. అయితే కొండల మధ్య సహజ సిద్ధంగానే ఏర్పడిన సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల వద్ద ఉన్న గ్యాప్‌లను కాంక్రీటు ద్వారా కొండలను కలిపారు. 

నేడు సీఎం ప్రాజెక్టు సందర్శన
పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, కలెక్టర్‌ పోల భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బుధవారం మండల పరిధిలోని కొత్తూరు వద్దకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ ప్రాంగణాలతో పాటు, ముఖ్యమంత్రి ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించే ప్రాంగణం, రాజకీయ నాయకులు వేచి ఉండే ప్రాంతాలను పరిశీలించారు.  హెలీపాడ్‌ వద్దకు చేరుకుని సీఎం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు.  భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ పర్యవేక్షించారు.
​​​​​​​ 

భారీ బందోబస్తు 
సీఎం పర్యటన దృష్ట్యా బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలను అడిషనల్‌ ఎస్పీలకు అప్పగించారు. ఏడుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 1000 మంది కానిస్టేబుళ్లు, స్పెషల్‌ పార్టీ పోలీసులు 100 మంది, ఏరియా డామినేషన్‌ 40 మందిని నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 60 మంది కూంబింగ్‌ పార్టీ సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించామని ఎస్పీ తెలిపారు. హెలీపాడ్‌ వద్ద బారికేడ్లు, సమీక్ష ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలను మంత్రి సురేష్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహించే అ«ధికారులకు పలు సూచనలు చేశారు. 

 • ప్రాజెక్టు సవరించిన అంచనాలు విలువ రూ. 8,440 కోట్లు  
 • ఈ సంవత్సరం జనవరి 31 వరకు ఖర్చు చేసింది. రూ. 5237.30 కోట్లు  
 • నిర్మాణ పనుల కోసం రూ. 3661.46 కోట్లు  
 • భూముల కొనుగోలు ద్వారా ఖర్చు చేసింది రూ. 384.21 కోట్లు  
 • పునరావాసం కోసం రూ. 97.27 కోట్లు 
 • అటవీ శాఖకు చెల్లించింది రూ. 437.04 కోట్లు  
 • ఇతర ఖర్చులకు చెల్లించింది రూ. 657.32 కోట్లు 
 • ఈ ప్రాజెక్టు కోసం కావాల్సిన మొత్తం భూమి 42,684 ఎకరాలు 
 • కొనుగోలు చేసింది 30,391 ఎకరాలు
 • ఇంకా తీసుకోవాల్సిన భూములు 2,442 ఎకరాలు 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top