
24 గంటల విద్యుత్ పట్టణాలకే!
రాష్ట్రంలో గృహావసరాలకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరంత ర విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర సర్కారు హామీలు, ప్రకటనలతో..
* తొలుత జిల్లా కేంద్రాలు, పట్టణాలకే పరిమితం: మంత్రి రఘునాథ్‌రెడ్డి
* వ్యవసాయానికి 7 గంటల విద్యుత్.. మలి దశలో 9 గంటలు చేస్తాం
* 2016 మార్చి నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్ సరఫరా
* ఐదేళ్లలో 19,055 మెగావాట్ల విద్యుత్‌తో ‘లోటు’ లేని ఏపీయే లక్ష్యం
* ‘ఉత్పత్తి’ పెంపులో సహకరించాలని కేంద్ర విద్యుత్‌మంత్రిని కోరాం
* బొగ్గు, గ్యాస్ సరఫరాలు పెంపునకు సానుకూలంగా స్పందించారు
* విద్యుత్‌శాఖ మంత్రుల సదస్సు అనంతరం ఏపీ ఐటీ మంత్రి వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో గృహావసరాలకు సంబంధించి అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరంత ర విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర సర్కారు హామీలు, ప్రకటనలతో.. ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పేర్కొన్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి.. మొదటి విడతలో భాగంగా కేవలం జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే నిరంతర విద్యుత్ సరఫరా అమలు చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత రెండేళ్లలో దశల వారీగా రాష్ట్రంలోని పల్లెలకు నిరంతర విద్యుత్ సరఫరాను విస్తరిస్తామని చెప్పారు.
అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మలి దశలో సాగుకు విద్యుత్ సరఫరాను 9 గంటలకు పెంచుతామన్నారు. అలాగే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ 2016 మార్చి నాటికి విద్యుత్ సరఫరా చేస్తామని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరాకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల విద్యుత్‌శాఖల మంత్రుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరఫున రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏడాదిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం...
‘‘రాష్ట్రంలో అక్టోబర్ 2 నుంచి గృహాలకు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం అవుతుంది. అదేవిధంగా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తాం. సాగు రంగానికి మలి దశలో 9 గంటల విద్యుత్ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టి వచ్చే ఏడాదిలో దేశంలోనే విద్యుత్ సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటం, ఐదేళ్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లటం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం’’ అని పల్లె పేర్కొన్నారు. ‘అందరికీ విద్యుత్’ అనే కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, రాజస్థాన్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఏపీలో విద్యుత్ సంస్కరణలతో పాటు, విద్యుత్ లోటును పూడ్చేందుకు సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలను కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ అభినందించినట్లు చెప్పారు.
3 నెలల్లోనే విద్యుత్ లోటు లేకుండా చేశాం..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, మూడు నెలల్లోనే విద్యుత్ ఉత్పాదన పెంచి విద్యుత్ లోటు లేకుండా చేశామని పల్లె చెప్పారు. ఇందుకు రాష్ర్టేతర విద్యుత్ సంస్థల నుంచి 400 మెగావాట్లు, కృష్ణపట్నం పవర్‌ప్రాజెక్టు నుంచి 800 మెగావాట్లు కలిపి మొత్తం 1,200 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చగల్గినట్టు తెలిపారు. వచ్చే ఏడాది లోగా 2,000 మెగావాట్ల విద్యుత్ కోసం ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు చెప్పారు.
వచ్చే ఐదేళ్లలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికోసం బిడ్డింగ్‌లు పిలిచామన్నారు. అదేవిధంగా రానున్న ఐదేళ్లలో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్, 4,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో త్వరలో 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిలో అనంతపురంలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయని చెప్పారు. ఎన్‌టీపీసీ సహకారంతో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్టునకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకునేందుకు కేంద్ర విద్యుత్‌శాాఖ మంత్రి రానున్నట్టు వెల్లడించారు.
2016 మార్చి నాటికి అన్ని గ్రామాలకు విద్యుత్...
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేని 2,551 గ్రామాలకు 2016 మార్చి నాటికి విద్యుత్ సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే 2017 మార్చి నాటికి రాష్ట్రంలో ఆరు లక్షల గృహాలకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. విద్యుత్, ఇంధన ఆదాలో భాగంగా గృహాల్లో ఎల్‌ఈడీ బల్బులు, వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉండే పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటికీ వినియోగదారుల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ప్రభుత్వమే భ ర్తీ చేసేలా చూస్తామన్నారు.
వచ్చే ఐదేళ్లలో ఏపీజెన్‌కో ద్వారా 3,850 మెగావాట్లు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 1,040 మెగావాట్లు, సోలార్ ద్వారా 5,030 మెగావాట్లు, పవన విద్యుత్ 4,150, ఎన్‌టీపీసీ ద్వారా 4,000 మెగావాట్లు, సెంట్రల్ పవర్ స్టేషన్ల నుంచి 985 మెగావాట్లతో కలిపి మొత్తం 19,055 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనతో విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. మిగులు విద్యుత్ ఉంటే గతంలో చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేస్తామన్నారు. కాగా,రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌గోయల్ సానుకూలంగా స్పందించినట్టు రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, జెన్‌కో కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు.