పలమనేరులో రాముడు భీముడు

Two Elephants Hulchul In Palamaneru Village Chittoor - Sakshi

జనావాసాల మధ్య జంట ఏనుగుల హల్‌చల్‌

భయపడి పరుగులు     తీసిన జనం

భూతలబండ అడవిలోకి మళ్లించిన ట్రాకర్స్‌

పలమనేరు: ఇన్నాళ్లు కౌండిన్య అటవీ ప్రాంత గ్రామాలు, అక్కడి పంట పొలాలకు పరిమితమైన గజరాజులు ఏకంగా పలమనేరు పట్టణంలోకి వచ్చేశాయి. పట్ణణ పొలిమేర్లలోని అడవిలోంచి రెండు ఏనుగులు ఆదివారం ఉదయం గొబ్బిళ్లకోటూరు, గంటావూరు మధ్య నుంచి చెరువులు, జనావాసాల్లోకి రావడంతో జనం హడలిపోయారు. ఏనుగులను చూసేందుకు భారీగా జనం రావడంతో అవి ఆందోళనకు గురై ఘీంకారాలు పెట్టాయి. అక్కడున్న వారు గోవిందా గోవిందా అని నినాదాలు చేస్తూ వాటిని తరిమేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానిక ఎఫ్‌ఆర్వో మదన్‌మోహన్‌రెడ్డి తమ సిబ్బంది, ట్రాకర్స్‌తో కలసి వాటిని జాగ్రత్తగా అడవిలోకి మళ్లించారు. గంటపాటు కష్టపడిన ట్రాకర్స్‌ ఏనుగులను భూతలబండ వైపునకు మళ్లించారు.

ఈ ప్రాంతాన్ని వదలనిరాముడు, భీముడు..
కౌండిన్య అడవిలో రెండు గుంపులుగా 22 ఏనుగులున్నా ఈ రెండు మాత్రం కొన్నాళ్లుగా జంటగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా అడవికి ఆనుకుని ఉన్న మొగలిఘాట్, గంటావూరు అడవి, మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు, దానికిందనున్న చెరువు, బేరుపల్లి అటవీ ప్రాంతాల్లోనే ఉంటున్నాయి. ఈ మధ్య చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపైకి వచ్చిన ఏనుగులు ఇవే. ప్రస్తుతం ఇవి మకాం పెట్టిన అడవికి ఉత్తరం, తూర్పువైపు జాతీయ రహదారి పనులు రాత్రి పగలు అనే తేడాలేకుండా సాగుతున్నాయి. యంత్రా ల శబ్ధాల కారణంగా ఇవి దారి మార్చినట్టు ఎఫ్‌ఆర్వో తెలిపారు. ఇక అడవి సరిహద్దులో సాగుతున్న ఎలిఫెంట్‌ ట్రెంచెస్‌లో రాళ్లను పగులగొట్టేందుకు బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. దీంతో వెలువడే నల్లమందు వాసనకు ఆ వైపునకు ఇవి వెళ్లడం లేదని తెలిపారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి మోర్ధన అడవిలోకి మళ్లించనున్నట్టు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top