
శెట్టేరి వద్ద మృతి చెందిన మదపుటేనుగు
పలమనేరు : రౌడీగా పేరుపొంది రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఓ ఏనుగు ఇలా నిర్జీ వంగా పడి ఉంది. కౌండిన్య అటవీ ప్రాంత సమీపంలోని శెట్టేరి వద్ద అనా రోగ్యంతో చనిపోయినట్లు అధికారులు సోమవారం ధ్రువీకరించారు. అడవిలో రాముడు, భీముడు జంటగా, మరో ఆరు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నాయి. పాతికేళ్ల వయసున్న ఈ మదపుటేనుగు ఆరేళ్లుగా ఒంటరిగానే తిరిగేది. ఒక్కసారి గుంపునుంచి విడిపోతే మళ్లీ కలవడానికి మిగిలిన ఏనుగులు అంగీకరించవు.
ఏనుగులు రానివ్వకపోవడం, గ్రామాల్లో ప్రజలనుంచి దాడులు, టపాసుల శబ్ధాలు లాంటి చర్యల ఫలితంగా క్రూరంగా తయారైందని స్థానికులు చెబుతుంటారు. పంటలపై పడి నాశనం చేసేది. జనంపైకి తిరగబడేది. ముఖ్యం గా ఊసరపెంట, పెంగరగుంట, బేరుపల్లి రైతులకు ఈ ఏనుగంటే హడల్. ఇది తిరుగుతుందని తెలిస్తే ఊసరపెంటవాసులు ఇళ్లమిద్దెలపై గడిపేవారు. గతంలో ఓ రైతును తొక్కిచంపింది. కాలువపల్లి అడవిలో ఇద్దరు ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసింది. ఇంద్రానగర్‌కు చెందిన యువకులను కిలోమీటరుమేర తరిమింది. ఈ గజరాజు చనిపోయిందని తెలియగానే చాలామంది చూసేందుకు వచ్చారు.