కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
విశాఖపట్నం: కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి.
కోస్తాంధ్రలో మంగళవారం పలుచోట్ల 40 డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 40 డిగ్రీలు నమోదైంది. తిరుపతి, నందిగామ, జంగమహేశ్వరపురం (రెంటచింతల), గన్నవరంలలో 38 డిగ్రీలు, తెలంగాణలోని నిజామాబాద్, రామగుండంలలో 40 డిగ్రీలు, హైదరాబాద్‌లో 37 డిగ్రీలు నమోదయ్యాయి. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.