మరో ముగ్గురి విజయం

Three People Discharge From Covid 19 Hospital in Anantapur - Sakshi

46కు చేరిన కోవిడ్‌ డిశ్చార్జ్‌ల సంఖ్య      

అందులో స్టాఫ్‌నర్సు, సెక్యూరిటీ గార్డులు     

మరో 8 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు  

అనంతపురం హాస్పిటల్‌/హిందూపురం: కోవిడ్‌పై మరో ముగ్గురు విజయం సాధించారు. సోమవారం బత్తలపల్లి ఆర్డీటీ కోవిడ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. వీరందరూ అనంతపురం సర్వజనాస్పత్రి సిబ్బంది. కోవిడ్‌తో డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 46కు చేరింది. ఈ మేరకు కలెక్టర్‌ గంధం చంద్రుడు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. డిశ్చార్జ్‌ అయిన వారిలో జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ మూడో క్రాస్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ (స్టాఫ్‌నర్సు), ధర్మవరానికి చెందిన 25 ఏళ్ల యువకుడు (సెక్యూరిటీ గార్డు), అరవిందనగర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు (సెక్యూరిటీ సూపర్‌వైజర్‌) ఉన్నారు. వీరికి ఆరోగ్యశాఖ అధికారులు రూ.2వేలు చొప్పున అందజేశారు. 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు తెలిపారు.  

115కు చేరిన కోవిడ్‌ కేసుల సంఖ్య..
జిల్లాలో మరో 8 మంది కోవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో నలుగురు వృద్ధులు ఉన్నారు.హిందూపురం ప్రాంత వ్యక్తులతోపాటు అనంత నగరంలోని రహమత్‌నగర్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం 66 యాక్టివ్‌ కేసులతో కోవిడ్‌బారిన వారి సంఖ్య 115కు చేరింది. జిల్లాలో 1,159 నమూనాలను అధికారులు సేకరించారు. అందులో 964 మందికి ఫలితాలు వెల్లడించారు.

క్వారంటైన్‌ నుంచి 45 మంది డిశ్చార్జి
బుక్కరాయసముద్రం: రోటరీపురం వద్దనున్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ నుంచి 45 మంది డిశార్జి అయినట్లు  తహసీల్దార్‌ మహబూబ్‌బాషా తెలిపారు. తబ్లిక్‌కు వెళ్లి హిందూపురంలో నిలిచిపోయిన ఢిల్లీకి చెందిన 11 మంది, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 మంది, గుజరాత్‌కు చెందిన 21 మందిని 26 రోజులుగా అధికారులు ఎస్‌ఆర్‌ఐటీలో క్వారంటైన్‌లో డాక్టర్‌ దయాకర్‌ పర్యవేక్షణలో ఉంచారు. వీరందరికీ సోమవారం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. తహసీల్దార్‌ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు పంపారు. అదేవిధంగా పరిగి మండలానికి చెందిన ఓ వ్యక్తి డిశార్జి అయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top