బాసర శ్రీ జ్ఙానసరస్వతీ ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు.
భైంసా, న్యూస్‌లైన్ :
బాసర శ్రీ జ్ఙానసరస్వతీ ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. అమ్మవారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, భక్తుల పూజాధికాలు, చిన్నారుల అక్షరశ్రీకారాల నిర్వహణకు ఆలయంలో ఒక స్థానాచార్య, ఒక ప్రధాన అర్చక, ఇద్దరు ఉపప్రధాన అర్చకులు, ఇద్దరు ముఖ్యఅర్చకులు, ఏడుగురు అర్చకులు, ఏడుగురు పరిచారికలు, నలుగురు వేదపండితులు ఉన్నారు. వీరు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు షిప్టులుగా విధులు నిర్వర్తిస్తారు. నెలలో మెదటి అర్ధభాగం ఉదయం విధుల్లో ఉన్న బ్యాచ్, తర్వాతి 15 రోజుల్లో మధ్యాహ్నం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పండుగలు, ప్రముఖులు వచ్చిన సమయాల్లో అందరూ విధిగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇది వాస్తవంగా ఆలయాధికారులు, ఆలయస్థానాచార్య, ప్రధాన అర్చకుల ప్రమేయంతో కూడిన అధికారిక నిర్ణయం. అధికారులు, అర్చకులు దీన్ని ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ ఆలయంలో ఇవేమీ అమలు కావడంలేదు.
జరుగుతోంది ఇదీ..
అధికారుల ఈ నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితమైంది. దేవాదాయశాఖ అర్చకులకు వేలల్లో జీతాలు చెల్లిస్తున్నా.. అనాదిగా కొనసాగిన వంశపారంపర్య అర్చకత్వమే ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో బాసర గ్రామానికి చెందిన బ్రాహ్మణ కుటుంబాలు ఆలయంలో అర్చకత్వం నిర్వహించేవి. నెలల వారీగా వంతులు వేసుకుని సంవత్సరంపాటు వారు అర్చక విధులు నిర్వర్తించేవారు. తిరిగి మరుసటి సంవత్సరం అదే పద్ధతి కొనసాగించారు. ఆలయంలో పూజాధికాలు నిర్వహించినందుకు గాను ప్రభుత్వం అర్చకులకు డబ్బులు చెల్లించేది కాదు. భక్తుల నుంచి వచ్చిన కానుకల్ని మాత్రమే స్వీకరించేవారు. అయితే ఈ విధానంలో అమ్మవారికి చెందాల్సిన కానుకలు, ఆదాయం పక్కదారి పడుతోందని, అక్రమాలకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుచేసింది. అర్చక కుటుంబాల నుంచి అర్చకత్వ అర్హతలు ఉన్న వారికి ఆలయంలో ఉద్యోగాలు ఇచ్చి వారికి వేలల్లో జీతాలు నిర్ణయించింది. అలా ఆలయంలో అర్చక విధులు నిర్వర్తించిన బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం వారే ఆలయంలో విధులు నిర్వహిస్తున్నరు.
ప్రభుత్వ ఆశయానికి గండి...
ప్రభుత్వం సదాశయంతో నూతన విధానాన్ని అమలు చేయాలనుకున్నా, వారు పాత పద్ధతిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదాయం లేని చోట్ల ఆలయాధికారులు నిర్ణయం మేరకు విధులు నిర్వర్తిస్తున్నా, ప్రధాన ఆలయంలో (గర్భగుడి,అంతరాలయం) మాత్రం అర్చకుల పాత పద్ధతినే వంశపారంపర్యలో అమలవుతున్నారు. ఆలయ అధికారులు నిర్ణయించిన వేళల్లో కాకుండా ఎవరి పూజా సమయంలోనైనా ఆ కుటుంబం విధులు నిర్వర్తిస్తోంది. వేలల్లో జీతాలు పొందుతున్న అమ్మవారి కానుకలపై అనురక్తి వారికి సిరులు కురిపిస్తోంది. అడిగే నాథుడు, అడ్డుచెప్పే అధికారి లేకపోవటం అర్చకులకు వరంగా మారింది.
మిగతా వారిలో అలసత్వం...
ఆలయంలో ఈ వంశపారపంపర్య విధానం కారణంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా ఆలయ ఆదాయానికి గండిపడుతుండగా, వంతులో భాగంగా తమది కాని రోజుల్లో మిగతా పూజారుల్లో అలసత్వం చోటుచేసుకుంటోంది. వంశపారంపర్య విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ గర్భగుడిలో అనధికారికంగా తిష్టవేసి అమ్మవారికి చెందాల్సిన కానుకలను తమ జేబులో వేసుకుంటున్నారు. వంతులేని పూజరులది మరోకథ. వంతులవారీ పూజ మనది కాదు, అదనపు ఆదాయం ఏమీ రాదు అనే భావనతో వారు విధులకు సరిగా హాజరుకావటం లేదు. సెలవుపెట్టడం లేదా గైర్హాజరవుతున్నారు. నామమత్రంగా ఆలయ ఇన్‌స్పెక్టర్‌కు సెలవు చీటి పంపుతున్నారు.
ప్రధాన అర్చకులు, స్థానాచార్యకు గైర్హాజరు విషయం తెలిపి వారి అనుమతి తీసుకోవాల్సి ఉన్న అర్చకులు అలా చేయటం లేదు. దీంతో భక్తులకు అర్చకుల కొరత ఏర్పడుతోంది. అక్షరాభ్యాసాలు ఆలస్యమవుతూ చిన్నారులు క్యూలైన్‌లో అలమటిస్తున్నారు. ఈ విషయంలో ఈవో అర్చకులకు హెచ్చరిక చేసినా వారిలో స్పందన లేదు. ఈ విషయమై గ్రామస్తులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. వేలల్లో జీతాలు తీసుకుంటున్న అర్చకులు అక్రమ సంపాదనకు ఆశపడి పాతపద్ధతిని కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గతంలో బాసర మాజీ సర్పంచ్ రమేశ్, గ్రామస్తులు పలుమార్లు ఆలయ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ గ్రామస్తులు ఇచ్చిన విన్నపాలు బుట్టదాఖలయ్యాయి. ఎవరి మాటలు లెక్కలోకి తీసుకోవడం లేదు.
ఇక ఆలయంలోనూ సీసీ కెమెరాలు అక్కడక్కడ పనిచేయకపోవడంతో రోజూ వచ్చే కానుకలు మూటలు కట్టుకుని ఇళ్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ పాలకులు కళ్లు తెరవాలని భక్తులు కోరుతున్నారు. ఇకనైనా ఆ విధానానికి ఆలయాధికారులు స్వస్తి పలికాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆలయానికి ఆదాయం పెరగటంతోపాటు, భక్తులకు మెరుగైన సేవలు అందుతాయి. ఈ విషయమై ఆలయ ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.