‘టెర్రకోట’ ఉపాధికి బాట 

Terrakota Artists Using New Technology - Sakshi

కళాకృతుల తయారీలో ఉచిత శిక్షణ

నూతన సాంకేతికత  వినియోగం

ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణ 

ఆన్‌లైన్‌లోనూ వ్యాపారం 

స్వయం ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం 

ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. చేపలను ఇవ్వడం కన్నా.. వాటిని పట్టే వలను అందించి ప్రోత్సహించడం మిన్న. సరిగ్గా ఈ విధానానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ఎందరికో స్వయం ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పించి స్థానికులకు శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే వారు తయారు చేసే వస్తువులను అంతర్జాతీయ విపణిలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘టెర్రకోట’ కళను ప్రోత్సహించడం ద్వారా పలువురి ఉపాధికి నడుం బిగించింది. 

పలమనేరు: జిల్లాలో టెర్రకోట కళాకారులకు పలమనేరు ప్రసిద్ధి. పట్టణానికి సమీపంలోని టెర్రకోట కాలనీలో సుమారు వంద కుటుంబాలకు ఈ కళే జీవనోపాధి. వీరికి మరింత చేయూతనందించడమే లక్ష్యంగా గంటావూరు సమీపంలో రూ.2కోట్లతో డీఆర్‌డీఏ ‘టెర్రకోట హబ్‌’ను ఏర్పాటు చేసింది. ఇందులో  టెర్రకోట కళాకారులు ఇప్పటి వరకు తయారు చేస్తున్న వస్తువులకు  పశ్చిమ బెంగాల్, ఒడిశా డిజైన్లను జోడించి విభిన్న ఆకృతులను సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అధిక సంఖ్యలో యువతీయువకులను టెర్రకోట కళలో నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

 నెలరోజుల శిక్షణ.. 
టెర్రకోట హబ్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఏపీఎస్‌డీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), సీఎఫ్‌సీ (కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్, రీచ్‌ సంస్థల ఆధ్వర్యంలో యువతకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. వీరి పర్యవేక్షణలో 50మంది నెల రోజులపాటు శిక్షణ పొందారు. తొలి బ్యాచ్‌కు టెర్రకోట హబ్‌లోనే ఉపాధి కల్పించారు. కావాలనుకుంటే వారు ఇళ్ల వద్ద కూడా కళాకృతులను తయారు చేసుకుని ఉపాధి పొందవచ్చు.

 విభిన్న ఆకృతులకు డిమాండ్‌.. 
నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్న టెర్ర కోట కళాకారులు విభిన్న ఆకృతులను తయా రు చేస్తున్నారు. వాటికి ప్రస్తుత మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొళాయి అమర్చిన మట్టి కూజాలు, వేలాడే కుండీలతోపాటు శుభకార్యాల్లో బహుమతులు గా ఇచ్చేందుకు పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. చివరకు ఫొటోఫ్రేమ్‌లను సైతం మ ట్టితో తయారుచేయడం విశేషం.

పాత పద్ధతులకు స్వస్తి..
గతంలో మట్టికుండలు తయారీలో వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రిక్‌ వీల్‌ మెషీన్‌ వచ్చింది. బంకమట్టిని కాళ్లతో తొక్కాల్సిన అవసరం లేకుండా ప్లగ్‌మిల్‌ మిక్చర్‌ అనే యంత్రం అందుబాటులో ఉంది. మట్టి  వస్తువులను బట్టీ్టలో కాల్చే పనిలేకుండా విద్యుత్‌లో నడిచే సిలన్‌ వచ్చింది. దీంతోపాటు బాల్‌మిల్, ఫిల్టర్లు, కట్టర్లు.. ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి బొమ్మల తయారీకి యంత్రాల వాడకంపై హస్త కళాకారులకు టెర్రకోట హబ్‌లో శిక్షణ ఇస్తున్నారు.

ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు...
టెర్రకోట హబ్‌లో తయారైన కళాకృతులను బెంగళూరుకు చెందిన పలు కంపెనీల ద్వారా ఆన్‌లైన్‌లో దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే టెర్రకోట కళాకారులే ఆన్‌లైన్‌లో విక్రయించుకునేలా డీఆర్‌డీఏ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా పలమనేరు మట్టి విదేశాలకు సైతం చేరుతుండడం విశేషం. 

ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు..
ప్రభుత్వం నెలకొల్పిన శిక్షణ కేంద్రంలో టెర్రకోట కళను ఉచితంగానే నేర్చుకోవచ్చు. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బతకవచ్చు. హబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నాం. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. 
-రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘం, పలమనేరు 

టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణపొందా.. 
మాది గంటావూరు గ్రామం. ఉపాధి కోసం ఇక్కడ శిక్షణ పొందా. ఇప్పుడు కొంతవరకు పని నేర్చుకున్నా. ఇందులో చాలా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంటి వద్దే పీస్‌ వర్క్‌ చేసుకుంటున్నాం.
-స్నేహ, గంటావూరు 

చాలా చక్కగా నేర్చుకుంటున్నారు... 
మట్టిబొమ్మల తయారీపై కొత్త టెక్నిక్‌లతో శిక్షణనిస్తున్నా. ఇక్కడి వారు చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారు. నెలరోజుల శిక్షణ పూర్తయితే ఇక్కడే పీస్‌ వర్క్‌ చేసుకోవచ్చు. సొంతవూర్లోనే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారైన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది.
-గణేష్‌పాల్, శిక్షకుడు, కలకత్తా 

చేతిలో పని ఉంటే ఎలాగైనా బతకవచ్చు 
ఊరికే ఇంట్లో ఉండే బదులు ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. పని నేర్చుకున్నాక పీస్‌ వర్క్‌ చేసుకున్నా చాలు. ప్రభుత్వం మాలాంటి వాళ్లకు మంచి అవకాశం కల్పించింది.
-లలిత, గంటావూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top