
ప్రపంచంలోనే అత్యాధునిక వాతావరణ అంచనా వ్యవస్థ ఆవిష్కరణ
భారత్ ఫోర్‌క్యాస్టింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: కొన్ని గ్రామాలకు కలిపి ఉమ్మడి అంచనాను విడుదలచేయడానికి బదులు అత్యల్పంగా ఆరు కిలోమీటర్ల పరిధిలోనూ వాతావరణ స్థితిని తెలియజెప్పే అత్యాధునిక వ్యవస్థను భారత్ సోమవారం ఆవిష్కరించింది. భారత ఉష్ణమండల వాతావరణశాస్త్ర సంస్థ(ఐఐటీఎం) అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతకు భారత్ ఫోర్‌క్యాస్టింగ్ సిస్టమ్(బీఎఫ్‌ఎస్) అని నామకరణం చేశారు. దీనిని భూవిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు.
యురోపియన్, బ్రిటిష్, అమెరికా వాతావరణ విభాగాలు సైతం 9 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్లను ఒక యూనిట్‌గా తీసుకుని వాతావరణ అంచనాలు వెలువరుస్తుండగా భారత్ ఆరు కిలోమీటర్ల స్థాయిలోనూ వాతారణ అంచనాను ఇకపై వెలువర్చనుండటం విశేషం. ఆరు కిలోమీటర్ల రెజల్యూషన్‌తో భారత వాతావరణ శాస్త్ర శక్తిసామర్థ్యాల పురోగతిని బీఎఫ్‌ఎస్ చాటుతోందని మంత్రి జితేంద్ర వ్యాఖ్యానించారు. ‘‘వాతావరణానికి సంబంధించిన భూమధ్యరేఖ జోన్ అనేది అత్యంత అస్తవ్యస్తంగా ఉంటుంది. దీనిని అంచనావేయడానికి అత్యధిక రెజల్యూషన్ వ్యవస్థ తప్పనిసరి’’అని భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు.
ఏమిటీ బీఎఫ్‌ఎస్?
దేశవ్యాప్తంగా అమర్చిన 40 డాప్లర్ వాతావరణ రాడార్ల నుంచి సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా విశ్లేíÙంచి చిన్నపాటి ‘వాతావరణ అంచనా’నివేదికను రూపొందిస్తారు. గతంలో వాతావరణ యూనిట్ పెద్దగా ఉండేది. అంటే నాలుగైదు గ్రామాలకు కలిపి ఒకే అంచనాకు వచ్చేవారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు డాప్లర్ రాడార్ల సంఖ్యను పెంచుకుంటూ అదనపు డేటాతో మరింత స్పష్టమైన ‘వాతావరణ అంచనా’ను రూపొందిస్తారు. నాలుగు గ్రామాలకు కలిపికాకుండా విడివిడిగా ఒక్కో గ్రామానికి సైతం ‘వాతావరణ అంచనా’ను ప్రకటిస్తారు.
డాప్లర్ వెదర్ రాడార్ల సంఖ్యను 100కు పెంచనున్నారు. దీంతో వచ్చే రెండు గంటల్లో వాతావరణం ఎలా ఉండబోతోందో సులభంగా అంచనావేసి చెప్పేయనున్నారు. ఈ ఫోర్‌క్యాస్టింగ్ సిస్టమ్‌ను పరిశోధకులతోపాటు పార్థసారథి ముఖోపాధ్యాయ అభివృద్ధిచేశారు. పార్థసారథి గతంలో ఐఐటీఎం క్యాంపస్‌లో ఆర్కా సూపర్‌కంప్యూటర్‌ను ఏర్పాటుచేశారు. ఇది 11.77 పెటాఫ్లాప్ సామర్థ్యంతో 33 పెటాబైట్స్ స్టోరేజీ కెపాసిటీతో పనిచేస్తుంది. పాత సూపర్‌కంప్యూటర్ ప్రత్యూష్ పది గంటల్లో చేసే పనిని ఇది కేవలం నాలుగు గంటల్లో చేయగలదు.