ధైర్యం.. త్యాగం.. ప్రకాశం

tanguturi Prakasam 148 Birth Anniversary Kurnool - Sakshi

నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

ఆంధ్రరాష్ట్ర మొదటి  ముఖ్యమంత్రిగా విశేష సేవలు  

సాక్షి, కర్నూలు :  స్వాతంత్య్ర ఉద్యమ పోరాటంలో బ్రిటిష్‌ తుపాకీకి ఎదురునిలిచి గుండె చూపిన ధైర్యశీలి అతను. వారాలు గడుపుతూ చదివి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మహోన్నతుడు ఆయన. అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శం. శుక్రవారం ఆయన 148వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872లో ప్రకాశం జిల్లా వినోదరాయుని పాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంతపతులకు జన్మించారు. ఆరుగురు సంతానంలో ప్రకాశం ఒకరు. 11 సంవత్సరాలకే తండ్రి మరణించడంతో తల్లి పూట కూళ్ల ఇళ్లు నడుపుతూ తన బిడ్డలను సాకింది. ఈయన కూడా వారాలకు కుదిరి రోజుకో ఇంట్లో అన్నం తింటూ చదువుకున్నారు.

నాటకాలంటే పిచ్చి ఉన్న పంతులు అనేక నాటకాల్లో నటించి పేరు పొందారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉంటూ అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకికెదురుగా గుండె నుంచి ‘ఆంధ్రకేసరి’ అని పేరు పొందారు. కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా విశేష సేవలు అందించారు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. 14 నెలలకే అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.  

ఆంధ్రకేసరి పాలనలో..  
కర్నూలు రాజధాని కావడానికి ఆంధ్రకేసరి టంగుటూరే కారకుడు. కర్నూలులో మెడికల్‌ కళాశాల, కేవీఆర్‌ కళాశాలల ఏర్పాటు జరిగింది. కేసీ కెనాల్‌ నీటి పారుదల వ్యవస్థను మార్చివేశారు. 30 టీఎంసీల నిరక జలాలను సాధించి ఏపీకి కేటాయించి 90 వేల ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలకు నీటి వ్యవస్థను పెంచారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. కర్నూలులో ఏబీసీ క్యాంప్‌లు ఆయన చొరవతోనే ఏర్పడ్డాయి. ఏపీపీఎస్‌ సెకండ్‌ బెటాలియన్‌ ఏర్పాటు జరిగింది. 1953– 56 వరకు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు నంద్యాలలో నిర్వహించారు. జిల్లా బోర్డును బనగానపల్లెలో నిర్వహించారు. దాని కోసం మొదట మౌళిక సదుపాయా లు కల్పించారు. తరువాత రోజుల్లో అవి ఉపయోగపడ్డాయి.ముఖ్య మంత్రి ఇళ్లు ఎస్టీబీసీ కళాశాలలో, మెడికల్‌ కళాశాల ఫోరెన్సిక్‌ బిల్డింగ్‌లో  సచివాలయం,  ప్రభుత్వ టౌన్‌ జూనియర్‌ కళాశాల, మెడికల్‌ కళాశా ల హాస్టల్‌లో ఎమ్మెల్యేల వసతి గృహాలు, నవరంగ్, అలంకార్‌ థియేటర్లు, ఫారెస్ట్‌ కార్యాలయాల్లో మంత్రుల గృహాలు. జిల్లా కోర్టు భవనంలో అసెంబ్లీని నిర్వహించారు. 

నేడు టంగుటూరి జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలు 
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలను కర్నూలులో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రకాశం పంతులుకు ఘన నివాళి అర్పించి ఆయన జ్ఞాపకాలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ గురువారం ఓ ప్రటకనలో తెలిపారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు.       

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top