పెద్దాసుపత్రికి పురిటినొప్పులు!

Staff And Beds Shortage In Anantapur Hospital - Sakshi

గైనిక్‌ వార్డులో పెరగని పడకల సంఖ్య  

ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు గర్భిణులు  

వైద్యుల నియామకంలోనూ వివక్ష

యూనిట్ల పెంపులో సర్వజనాస్పత్రికి నిరాశే

పట్టించుకోని పాలకులు  

వెనుకబడిన జిల్లా ఆఖరుకు ఆరోగ్య సౌకర్యాల్లోనూ వివక్షకు గురవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేల్లో దాదాపు 12 మంది టీడీపీ వారే అయినా.. అందులో ఇద్దరు మంత్రులుగా రాష్ట్రానికే సేవలందిస్తున్నా.. వీరిలో ఓ మహిళా మంత్రి ఉన్నా.. అనంతలోని అమ్మల ఆక్రందన చెవికెక్కని పరిస్థితి. కనీస ఆరోగ్య సౌకర్యాలు లేక మాతృమరణాలు పెరుగుతున్నా.. వారికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రసవ వేదనతో ఎందరో తల్లులు మృత్యువాత పడుతుండగా.. కళ్లు తెరవని పసికందులు తల్లి ప్రేమకు దూరమై మౌనంగా రోదిస్తున్నారు.

అనంతపురం న్యూసిటీ: రాష్ట్రంలో మాతృమరణాలు తగ్గించడంలో భాగంగా ఇటీవల డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) రాష్ట్ర వ్యాప్తంగా 19 గైనిక్‌ యూనిట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ ‘అనంత’ ఆస్పత్రికి ఒక్క యూనిట్‌ కూడా కేటాయించలేదు. దీని ప్రభావం గర్భిణులు, బాలింతలపై పడుతుందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, మంత్రులు సర్వజనాస్పత్రిని తనిఖీ చేసిన ప్రతిసారీ మెరుగైన వైద్యం అందించాలని చెబుతున్నారే కానీ.. వైద్యుల సంఖ్య, మౌలిక సదుపాయాల కల్పనపై నోరుమెదపడం లేదు. ఫలితంగా రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. మరోవైపు వైద్యులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

రెండు యూనిట్లతోనే ఏళ్లుగా సర్దుబాటు
సర్వజనాస్పత్రిలో గర్భిణులు, బాలింతల పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవంగా గైనిక్‌ వార్డులో రెండు యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్‌కు 30 పడకలుంటాయి. కానీ ఆస్పత్రిలో 250 మంది గర్భిణులు, బాలింతలుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైద్యులపై పని ఒత్తిడి
ఆస్పత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య రోజు రోజుకూపెరుగుతోంది. ఐపీతో పాటు ఓపీ మొత్తం కలుపుకుని 450 నుంచి 500 మంది వరకు వస్తుంటారు. బోధనాస్పత్రిలో యూనిట్‌కు ప్రొఫెసర్‌తో పాటు ఇద్దరు అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్లు, సీనియర్‌ రెసిడెంట్లు,ఇద్దరు జూనియర్‌ రెసిడెంట్లు ఉండాలి. సర్వజనాస్పత్రిలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్లు, ఐదుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న గర్భిణులు, బాలింతల సంఖ్య దృష్ట్యా 8 యూనిట్లు ఉండాలి. కానీ ఇక్కడ రెండు యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజూ 30 ప్రసవాలు జరిగితే అందులో 10 సిజేరియన్లు ఉంటున్నాయి. ఇలా ప్రతి నెలా 900 మందికి ప్రసవాలు జరుగుతున్నాయి. యూనిట్లు పెరిగితే ప్రొఫెసర్లతో పాటు అసోసియేట్, అసిస్టెంట్లు వస్తారు. మెరుగైన వైద్య సేవలూ అందే అవకాశం ఉంది.

అనంతలోనే ‘హైరిస్క్‌’
దేశ వ్యాప్తంగా లక్ష కేసుల్లో 130 మాతృమరణాలు సంభవిస్తున్నాయి. అదే ఏపీలో లక్ష మందికి 74 మంది, ‘అనంత’లో అయితే లక్షకు 40 మాతృ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మృతులంతా హైరిస్క్‌ గర్భిణీలే. రక్తహీనత, హైపర్‌టెన్షన్‌తో పాటు వివిధ రకాల సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. మాతృ మరణాలు తగ్గించాలని చెబుతున్న ప్రభుత్వం...ఆ స్థాయిలో వైద్యులను నియమించడం లేదు. ఒక వైద్యురాలు రోజూ దాదాపు 40 నుంచి 45 మంది గర్భిణులను చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం ఏవిధంగా సాధ్యపడుతుందని సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. మాతృ మరణాల తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా..మౌలిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమవుతోందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

కలెక్టర్‌ మాట బేఖాతర్‌
ఇటీవల జరిగిన హెచ్‌డీఎస్‌ సమావేశంలో కలెక్టర్‌ వీరపాండియన్‌ గైనిక్‌ వార్డుకు అదనంగా ఏఎన్‌ఎంలను నియమించాలని డీఎంహెచ్‌ఓ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్, సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌కు సూచించారు. కానీ వారిద్దరూ కలెక్టర్‌ మాటలను చెడచెవినపెట్టారు. సర్వజనాస్పత్రిలో 12 మంది మెటర్నిటీ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా.. ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మెటర్నిటీ అసిస్టెంట్ల పని కూడా వైద్యులే చేయాల్సి వస్తోంది. 

సర్దుకుంటేనే సేవలు
ఈ చిత్రం చూడండి... రెండు మంచాలపై ముగ్గురు బాలింతలు ఎలా సర్దుకునే ఉన్నారో... ఒకరు విశ్రాంతి తీసుకోవాలంటే మరొకరు కూర్చోవాల్సిందే. చిన్నారులను పక్కన పెట్టుకుని ఎక్కడ కాళ్లు తగులుతాయోనన్న భయంతో బాలింతలు అల్లాడిపోతున్నారు. మరోవైపు చాలా సేపు కూర్చుండిపోవడం వల్ల సీజేరియన్‌ చేసి కుట్లు వేసిన చోట నొప్పిగా ఉందంటూ బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఒక యూనిట్‌ అంటే
30 పడకలను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యూనిట్‌కు ఒక ప్రొఫెసర్‌.. ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్లు, ఇద్దరు జూనియర్‌ రెసిడెంట్లు అందుబాటులో ఉంటారు.  

యూనిట్లు పెరగాలి  
ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనిట్లు తప్పక పెరగాలి. రోజూ వందల మంది గర్భిణులకు సేవలందిస్తున్నాం. ఒక్క వైద్యురాలే అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మెటర్నిటీ సేవలు సైతం వైద్యులు చేస్తున్నారు. దీంతో పాటుగా విద్యార్థులకు నాలుగు పిరియడ్లు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో హైరిస్క్‌ కేసులు ఎలా చూడగలం.– డాక్టర్‌ షంషాద్‌బేగం, గైనిక్‌ హెచ్‌ఓడీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top