ఈతరం కుర్రాడు..!

Srikakulam Boy Talent in Swimming - Sakshi

చిన్న ప్రాయంలో జాతీయస్థాయి స్విమ్మింగ్‌లో రాణిస్తున్న దరహాస్‌

అంతర్జాతీయ స్థాయిలో రాణింపే లక్ష్యంగా అడుగులు

ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో జరిగే కేవీ స్పోర్ట్స్‌ కోసం కఠోర సాధన

చిన్నారులకు ప్రత్యేకమైన ఇష్టాలు ఉంటాయి. వాటిని గమనించి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలరు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తారు. అందుకు ఉదాహరణ వేమకోటి దరహాస్‌. చిరుప్రాయంలోనే స్విమ్మింగ్‌లో అద్భుత రీతిలో రాణిస్తున్నాడు. ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ, ఒక్కో స్థాయినీ అధిగమిస్తూ జాతీయ స్థాయి వరకు జిల్లా కీర్తిని తీసుకెళ్లాడు. తాను ఎదగడంతో పాటు తల్లిదండ్రుల గౌరవాన్నీ పెంచాడు. శ్రీకాకుళానికి చెందిన దరహాస్‌ విజయ ప్రస్థానాన్ని గమనిస్తే..

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీలో నివా సం ఉంటున్న వేమకోటి జగన్నాధ శ్రీధర్, ఎన్‌పి కవిత దంపతుల కుమారుడు దరహాస్‌. తండ్రి నగరంలోని కిమ్స్‌ హాస్పటల్‌లో రోగుల కేర్‌ టేకర్‌గా పనిచేస్తుండగా.. తల్లి నృత్య అధ్యాపకురాలు. దరహాస్‌కు చిన్నతనం నుంచి ఆటలంటే అమితమైన ఆసక్తి. కుమారుడి ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తొలిత రైఫిల్‌ షూటింగ్‌లో ప్రవేశం పొందాడు. 2016లో ఆట ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి భళా అనిపించా డు. రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకుంటూనే మరోవైపు తమ ఇంటికి సమీపంలో ఉన్న డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ఫూల్‌లో సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ ఉచిత శిక్షణకు హాజరయ్యేవాడు. దరహాస్‌లోని ప్రతిభను గుర్తించిన అప్పటి స్విమ్మింగ్‌ కోచ్‌ అప్పలనాయుడు, స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కాంతారావులు ప్రత్యేకంగా శిక్షణను అందించడం మొదలుపెట్టారు. దగ్గరుండి ప్రోత్సహించారు. అప్పటి నుంచి రైఫిల్‌ షూటిం గ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి, స్విమ్మింగ్‌పైనే దృష్టిపెట్టాడు. 2016 ఏడాది ఆఖరి నుంచి ప్రస్తుతం వరకు అనేక పోటీల్లో రాణిస్తూ వస్తున్నాడు. అనతికాలంలో పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించడమే కాకుండా సిక్కోలు నుంచి పిన్నవయస్సులో జాతీయ స్థాయిలో పతకాలు సాధించి స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. జిల్లా కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేశాడు. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్నాడు.

కొలనులోనిరంతరసాధన..
స్విమ్మింగ్‌లో సిక్కోలు భవిష్యత్‌ ఆశాకిరణంలో దూసుకెళ్తున్న దరహాస్‌ నిరంతరం శిక్షణతో రాటుదేరుతున్నాడు. ఉదయం, సాయంత్రం స్విమ్మింగ్‌ పూల్‌లో సరికొత్త టెక్నిక్స్‌ నేర్చుకుంటున్నాడు. ఈనెల 26 నుంచి హైదరాబాద్‌లో జరగన్ను కేంద్రీయ విద్యాలయం రీజనల్‌స్థాయి స్పోర్ట్స్‌–గేమ్స్‌ కోసం స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఇందుకోసం స్విమ్మింగ్‌ పూల్‌లో నిరంతరం సాధన చేస్తున్నాడు. స్విమ్మింగ్‌ కార్యదర్శి కాంతారావు, అసిస్టెంట్‌ కోచ్‌ మురళి పర్యవేక్షణలో తండ్రి ప్రోత్సాహంతో సాధన చేస్తున్నాడు.

అంతర్జాతీయ స్థాయితో ప్రాతినిథ్యమే లక్ష్యం
అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో ప్రాతినిథ్యమే నా లక్ష్యం. అందుకోసం అవసరమైన శిక్షణ పొందుతున్నాను. ఇప్పటివరకు అనేక రాష్ట్ర,జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. చాలా సంతోషంగా ఉంది. కోచ్‌లు, అసోసియేషన్‌ పెద్దలు, మా పేరెంట్స్‌ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.–  వేమకోటి ధనుష్య దరహాస్, జాతీయస్థాయి జూనియర్‌ స్విమ్మర్‌

ఇలా రాణించాడు
2016 డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి క్యాడెట్‌ బాలుర స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికై మొదటిసారి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. రాణించాడు.
2017 మేలో జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించడంతో విజయవాడలో జరిగిన సబ్‌జూనియర్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
2017 జూలైలో సంబల్‌పూర్‌లో జరిగిన కేంద్రీయ విద్యాలయం రీజనల్‌ గేమ్స్‌లో స్విమ్మింగ్‌ పోటీల్లో శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించి రజత పతకం సాధించాడు.
2017 నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 బాలుర రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించి 5వ స్థానంలో నిలిచాడు.
2017 డిసెంబర్‌లో వైఎస్‌ఆర్‌ కడపలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో కాంస్య పతకం సాధించి తొలిసారి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.
2018 జనవరిలో చెన్నైలో జరిగిన జాతీయస్థాయి స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించి శభాష్‌ అనిపించి చరిత్ర సృష్టించాడు.
2008 ఏప్రిల్‌ 25 నుంచి 27 వరకు కేంద్రీయ విద్యాలయం రీజనల్‌ గేమ్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించాడు.
రీజనల్‌ లెవల్‌లో పతకాలు సాధించడంతో 2018 జూలై 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరిగిన ఆలిండియా రీజనల్‌ కేంద్రీయ విద్యాలయం స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపికై రాణించి ప్రసంశలు అందుకున్నాడు.
2018 డిసెంబర్‌ 2, 3 తేదీల్లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో బటర్‌ ఫ్లై 50 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
2019 ఏప్రిల్‌ 26 నుంచి హైదరాబాద్‌లో జరగన్ను కేంద్రీయ విద్యాలయం రీజనల్‌ స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఇందుకోసం స్విమ్మింగ్‌ పూల్‌లో నిరంతరం సాధన చేస్తున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top