అంతర్జాతీయ సదస్సులకు ఆంధ్రప్రదేశ్ వరుస వేదికగా నిలుస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి : అంతర్జాతీయ సదస్సులకు ఆంధ్రప్రదేశ్ వరుస వేదికగా నిలుస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్ జె రత్నాకర్, హెచ్ జె దొర ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జూలై 12, 13, 14 తేదీలలో ఇంటర్నేషనల్ సత్యసాయి యూత్ కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. ప్రపంచం ఏపీ గురించి మాట్లాడుకోవాలనేదే తన ఆకాంక్ష అని చెబుతూ, రానున్న కాలంలో భారత్లో జరిగే ఎన్నో కార్యక్రమాలకు అమరావతి, విశాఖ వేదికలుగా నిలస్తాయన్న ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
‘లవ్ హ్యుమన్.. సర్వ్ హ్యూమన్’ అనే థీమ్‌తో పుట్టపర్తిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువ సమ్మేళనానికి 73 దేశాలనుంచి 1600 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతారని రత్నాకర్, దొర ముఖ్యమంత్రికి వివరించారు. చివరిరోజు గురుపౌర్ణమి నాడు నిర్వహించే కార్యక్రమం అపూర్వంగా వుంటుందని వారు చెప్పారు. సత్యసాయి సేవా సంస్థలు గత గోదావరి పుష్కరాలలో అద్వితీయమైన సేవలు అందించారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారన్నారు.
కృష్ణా పుష్కరాలలో అదే సేవాభావంతో పెద్దఎత్తున పాల్గొనాలని సత్యసాయి కార్యకర్తలను కోరుతున్నట్టు చెప్పారు. కొత్త రాజధాని రెండు జిల్లాలలో, కర్నూలులో జరిగే కృష్ణా పుష్కరాలకు రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించడానికి సేవాదళ్ కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నామన్నారు. పుట్టపర్తి అంతర్జాతీయ యువ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమత్రి హామీ ఇచ్చారన్నారు.