బండితోస్తేనే వైద్యం

Sarvajana Hospital Staff Negligence on Patients - Sakshi

సర్వజనాస్పత్రిలో ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓల ఇష్టారాజ్యం  

స్ట్రెచర్‌పై ఉన్న రోగులను వదిలేసి వెళ్తున్న వైనం  

తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులు

నగరంలోని నాల్గో రోడ్డుకు చెందిన నాగలక్ష్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఎఫ్‌ఎం వార్డులో చేరింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌కు రెఫర్‌ చేశారు. 11 గంటల సమయంలో నాగలక్ష్మిని స్కానింగ్‌ రూంకు తీసుకెళ్లేందుకు వచ్చిన ఎంఎన్‌ఓ ఆరోగ్య శ్రీ కార్యాలయం ముందు వరకూ తీసుకువెళ్లి..పని ఉందంటూ వెళ్లిపోయాడు. గంటన్నర గడిచినా ఎవరూ రాకపోవడంతో కుటుంబీకులు వార్డుకెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు వారే స్ట్రెచర్‌ తోసుకుంటూ స్కానింగ్‌ రూంకు తీసుకువెళ్లారు.

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎంఓలది ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారు. రోగులను వార్డుల్లోనుంచి రక్త పరీక్షలు, స్కానింగ్‌కు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిదే అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. పైగా నడవలేని స్థితిలో ఉన్న వారిని హీనంగా చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులను తరలించాల్సి వచ్చినా...స్ట్రెచర్‌పై ఉన్న రోగులను ఎక్కడపడితే అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక రోగులు నకరం చూస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు.  

పత్తాలేని సిబ్బంది
ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో 30 మంది ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రెగ్యులర్‌ ఎంఎన్‌ఎఓ, ఎఫ్‌ఎన్‌ఓలు 29 మంది వరకు ఉన్నారు. వీరు రౌండ్‌ ద క్లాక్‌ రోగులకు సేవలందించాల్సి ఉంది. కానీ వార్డుల్లో పూర్తి స్థాయిలో ఉండడం లేదు. ఆస్పత్రిలో అడ్మిషన్‌లో ఉన్న వారిని వైద్య పరీక్షల(ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్‌ స్కాన్, ఎంఆర్‌ఐ)తదితర సేవలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని వార్డుల్లో ఉదయం వైద్యులు రెఫర్‌ చేస్తే మధ్యాహ్నం వరకైనా సిబ్బంది తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు కుటుంబీకులే వైద్య పరీక్షలకు అతి కష్టం మీద తీసుకెళ్తున్నారు.  

నిద్రమత్తులో ఉన్నతాధికారులు
ఆస్పత్రిలో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రెసిడెన్షియల్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఆర్‌ఎంఓ) ఆవైపుగా దృష్టి సారించడం లేదు. వాస్తవంగా ఆర్‌ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓ, అసిస్టెంట్‌ ఆర్‌ఎంఓలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు వార్డులను పర్యవేక్షించి, అక్కడ రోగులేమైనా ఇబ్బందులు పడుతుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఆర్‌ఎంఓ కార్యాలయానికే పరిమితం కాగా... ఇదే అదునుగా సిబ్బంది పత్తా లేకుండా పోతున్నారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలు..రోగుల ఇబ్బందులపై కలెక్టర్‌ వీరపాండియన్‌ చొరవ చూపితే బాగుంటుందని రోగులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం  
రోగులను వైద్య పరీక్షల కోసం ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలే తీసుకెళ్లాలి. అలా చేయకుండా మధ్యలోనే వదిలేయడం సరికాదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్‌ లలిత, ఆర్‌ఎంఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top