
'సోనియాకు సవాల్ విసరడానికే సమైఖ్య శంఖారావం'
కిరణ్, చంద్రబాబులిద్దరూ సమైక్య ద్రోహులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు.
హైదరాబాద్: కిరణ్, చంద్రబాబులిద్దరూ సమైక్య ద్రోహులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైకమాండ్ కుట్రలో భాగంగానే సీఎం ఉద్యమాన్ని నడిపించారని, ఆ కుట్రలో భాగంగానే మళ్లీ ఉద్యమాన్ని విరమింపజేశారని ఆరోపించారు. జీఓఏం దగ్గరకు వెళ్లడమంటేనే విభజనకు అంగీకరించడమని అన్నారు. టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు.
దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డిలు చంద్రబాబును నిలదీయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో సమైక్యం కోసం లేఖ రాయించాలని సూచించారు. జగన్ సమైక్య సభ పెడుతుంటే టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సమైక్యం కోసం లేఖ రాస్తే దానిపై జగన్ కూడా సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
రాష్ట్రాన్ని విభజించిన సోనియాకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన సన్మానం చేస్తారని ఎద్దేవా చేశారు. సోనియాకు సవాల్ విసరడానికే లక్షల మందితో సమైక్య సభ పెడుతున్నామని చెప్పారు. సమైక్య ఉద్యమంపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.