12న రహదారుల దిగ్బంధం | roads Blockade on 12th december: ysrcp | Sakshi
Sakshi News home page

12న రహదారుల దిగ్బంధం

Dec 9 2013 1:01 AM | Updated on Aug 30 2018 4:51 PM

12న రహదారుల దిగ్బంధం - Sakshi

12న రహదారుల దిగ్బంధం

ఈ నెల 12వ తేదీన రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమం చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, కేంద్ర ప్రభుత్వం తమ వైఖరులను మార్చుకోనందుకు నిరసనగా శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న ఈ నెల 12వ తేదీన రహదారుల దిగ్బంధం, రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమం చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓట్లు, సీట్ల కోసం చేస్తున్న రాజకీయానికి, విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా మొదటి నుంచీ ఉద్యమిస్తున్న పార్టీగా వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చినట్టు ఆ ప్రకటన పేర్కొంది.
 
 నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీన విద్యార్థులు, యువకులు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తారు. 11వ తేదీన రైతులు ట్రాక్టర్‌ర్యాలీలు నిర్వహిస్తారు. 12వ తేదీన రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధిస్తారు. రోడ్లపైనే వంటావార్పూ కొనసాగిస్తారు. అలాగే 14 వ తేదీ నుంచి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గం చొప్పున భారీ యెత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈ ఉద్యమాల్లో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, అన్ని వృత్తి వర్గాలవారు... సమాజంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలంతా సహృదయంతో సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు.
 
 11న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
 
 ఈ నెల 12వ తేదీన రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా అంతకు ముందురోజు అంటే 11వతేదీన సాయంత్రం 5 గంటలకు  వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఉభయ సభల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement