పేటలో రెడ్‌ అలర్ట్‌

Red Alert in Naidupeta SPSR Nellore - Sakshi

నాయుడుపేట నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 21 మంది గుర్తింపు

జిల్లా ఐసొలేషన్‌లో ఉన్న 12 మందిలో ఒకరికి పాజిటివ్‌  

మరో 9 మంది జిల్లా కేంద్రానికి తరలింపు  

నెల్లూరు, నాయుడుపేటటౌన్‌: నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో గత నెల 15, 16 తేదీల్లో జరిగిన మత ప్రార్థనలకు జిల్లా నుంచి సుమారు 70 మంది వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 21 మంది నాయుడుపేట పట్టణానికి చెందిన వారు ఉన్నట్లు పోలీసులు, వైద్యాధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెంచలయ్య హెచ్చరికలతో స్థానిక ప్రభుత్వ వైద్యురాలు దేదీప్యరెడ్డి, సీఐ జీ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డీ వెంకటేశ్వరరావు తదితర శాఖల అధికారు లు అప్రమత్తమై పోలీసులు, వైద్యాధికారులు బృందంగా ఏర్పడి స్థానిక వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ చొరవతో పట్టణమంతా జల్లెడ పట్టి ఢిల్లీకు వెళ్లి వచ్చిన 21 మందిని గుర్తించారు. మూడు రోజుల కిందట 9 మందిని నెల్లూరు ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. మరోసటి రోజు మరో ముగ్గురిని పంపించారు.

బుధవారం మరో 9 మందిని జిల్లా కేంద్రానికి తరలించారు. వీరిలో 12 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారించారు.ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూచనల మేరకు ఆర్డీఓ సరోజిని, సీఐ జీ వేణుగోపాల్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ లింగారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై డీ వెంకటేశ్వర రావు, ప్రభుత్వ వైద్యాధికారిణి దేదీప్యరెడ్డి రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కమిషనర్‌ సిబ్బందితో చుట్టు పక్కల ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లి, హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.   కాగా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తి భార్య, కుమార్తెతో పాటు వారి ఇంటి పక్కనే ఉన్న ఓ వృద్ధురాలిని జిల్లా లోని ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. పాజిటివ్‌ నిర్ధారణ జరిగిన వ్యక్తితో మాట్లాడిన అక్కడి స్థానికుడైన మరో వ్యక్తికి తీవ్రంగా జ్వరం, «శ్వాస తీసుకోవడం ఇబ్బందులు పడుతుండడంపై స్థానిక ఆశ వర్కర్‌తో పాటు ఏఎన్‌ఎంలు గుర్తించి వైద్యాధికారిణికి తెలియజేశారు. అతనిని కూడా నెల్లూరుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే అతను రోధిస్తూ నెల్లూరుకు వెళ్లనని నిరాకరించడంతో ఎస్సైతో పాటు వైద్యాధికారిణి తదితరులు అతనికి నచ్చజెప్పి నెల్లూరుకు తరలించారు. 

రేబాలలో అలజడి
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): మండలంలోని రేబాల పంచాయతీకి చెందిన ఒక మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షలో బుధవారం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుచ్చిరెడ్డిపాళెంను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రేబాలకు చెందిన కొందరు ముస్లింలు ఇటీవల ఢిల్లీలో జరిగిన తబ్లిగ్‌ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చారు. ఆ ఆ తర్వాత గత శుక్రవారం స్థానికంగా ఉన్న మసీద్‌లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.  పలువురితో కలిసి తిరిగారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఒక కుటుంబంలోని భార్యాభర్తలను గత మూడు రోజుల క్రితం క్వారంటైన్‌ తరలించి పరీక్షలు నిర్వహించగా అతని భార్యకు కరోనా పాజిటివ్‌గా రావడంతో అధికారులతో పాటు బుచ్చిరెడ్డిపాళెం మండల ప్రజలు కలవరానికి గురయ్యారు. ఆమె భర్తకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగా ఇప్పటికే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ నెల 14వ తేదీ వరకు మండలంలో 144 సెక్షన్‌ అమలవుతుందని తహసీల్దార్‌ షఫీమాలిక్‌ తెలిపారు.  గ్రామంలో పారిశుద్ధ్యపనులు చేపట్టారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top