
తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు.
వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వాటిని చంపడమో, పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టడం జరుగుతోంది. అడవులు జనావాసాలుగా మారిపోవడమే ఈ పరిస్థితులకు కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు.