అది ఏకోపాధ్యాయ పాఠశాల. అంటే ఒకే ఒక్క టీచర్ ఉంటారన్నమాట. ఉన్న ఆ ఒక్కరూ ఏళ్ల తరబడి గైర్హాజరైతే పరిస్థితి ఏమిటి?..
అది ఏకోపాధ్యాయ పాఠశాల. అంటే ఒకే ఒక్క టీచర్ ఉంటారన్నమాట. ఉన్న ఆ ఒక్కరూ ఏళ్ల తరబడి గైర్హాజరైతే పరిస్థితి ఏమిటి?.. జలుమూరు మండలం పాఠశాలను చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడి ఉపాధ్యాయురాలు రాజకీయ పలుకుబడి ఉందని హుంకరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. తన స్థానంలో పదో తరగతి చదివిన యువతిని రూ.2 వేలకు పాఠాలు చెప్పే పని అప్పగించారు. ఈ విద్యా సంవత్సరంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. అక్టోబర్‌లో పాఠశాల వైపు కన్నెత్తి చూడని ఆమె.. నవంబర్‌లో నాలుగంటే నాలుగు రోజులే ముఖం చూపించారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను మాన్పించేసి.. వేరే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత పిల్లలందరినీ బడి మాన్పించేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
గొలియాపుట్టి ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయినిగా పీవీ మాధవి సుమారు నాలుగేళ్లుగా పని చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఉంటూ ఇక్కడకు రాకపోకలు చేస్తున్న ఈమె ఏ రోజు కూడా సక్రమంగా పాఠశాలకు రాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతోనే ఇంతగా బరి తెగుస్తున్నట్టు తెలిసింది. ఈమె ధైర్యం ఎంతవరకూ వచ్చిందంటే పదో తరగతి చదివిన ఓ యువతికి జీతం చెల్లించి టీచర్‌గా మార్చేసి పాఠాలు బోధించే స్థాయికి చేరింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల తరువాత జూన్‌లో పాఠశాల తెరుచుకున్నప్పుడు ఓసారి వచ్చిన ఉపాధ్యాయిని మాధవి ఆ తరువాత నామమాత్రంగా వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. అక్టోబర్‌లో ఒక్కరోజు కూడా బడిముఖం ఈమె చూడలేదు. నవంబర్ నెలలో కేవలం నాలుగు రోజులే వచ్చినట్టు హాజరు పట్టీ రుజువు చేస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉండడంతోపాటు, విద్యాశాఖా మంత్రి తెలుసంటూ ఇక్కడ విద్యాశాఖాధికారును భయపెట్టిన సందర్భాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు.
ఈమె స్థానంలో నెలకు రెండు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ఒప్పందంతో గ్రామంలోని 10 వతరగతి చదివిన మహిళ అనాధికారికంగా ఇక్కడ ఉపాధ్యాయినిగా చెలామణి అవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న మాధవి దీర్ఘకాలిక సెలవు కూడా పూర్తయి రెండు నెలలు దాటింది. నవంబర్‌లో కేవలం నాలుగు రోజలులే పని చేసిందని విద్యాశాఖాధికారి పి.సింహచలం తెలిపారు. వాస్తవంగా విద్యాహక్కు చట్టం ప్రకారం సంవత్సారానికి ప్రభుత్వ పాఠశాలలు 220 రోజలు పని చేయాలి. అలాగే 165 నుంచి 170 వరకు పీరియడ్స్ జరగాలి. ఇవేమి ఇక్కడ జరగలేదు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయలు 10 రోజులు సెలవు మించితే రెగ్యులర్‌గా డిప్యూటేషన్‌పై మరొకరిని నియమించాలి. కానీ పాఠశాల ప్రారంభం నుంచే మాధవి గైర్హాజరవుతున్నా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘనేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 22 మంది విద్యార్థులు ఉండేవారు. ఉపాధ్యాయిని రాకపోవడంతో ఎనిమిది మంది సమీపంలో ప్రైవేటు పాఠశాలలో చేరిపోయారు. మరో ముగ్గురు టీసీలు తీసుకొని తమ్మయ్యపేట పాఠశాలకు వెళ్లిపోయారు. ప్రసు ్తతం 13 మందే మిగిలారు. వీరిని కూడా సంక్రాం తి పండుగ తరువాత ప్రైవేటు పాఠశాలలో చేర్చేస్తామని తల్లిదండ్రులు నేతింటి సూరమ్మ, నేతింటి లక్ష్మి,రోహిణి తదితరులు తెలిపారు. పాఠశాల భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చామని, అయితే నేడు తమ పిల్లలకు చదువు చెప్పేవారు లేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు. ఎంఈవో సింహచలం మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయిని మాధవి దీర్గకాలిక సెలవు పూర్తయిన విషయం వాస్తవమేనన్నారు. అయితే పోస్టల్ ద్వారా అనారోగ్యంగా ఉన్నట్టు లెటర్ పంపించారన్నారు. ఈమె విషయాన్ని డీఈవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వెలిసోద గ్రామ పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై టీచర్‌ను పంపిస్తామన్నారు.