అంగన్‌వాడీల్లో అన్నీ సమస్యలే..!

Problems in anganwadi centers at Guntur - Sakshi

కేంద్రాలపై కొరవడిన పర్యవేక్షణ

జిల్లాలో కనీసం 50 శాతం కూడా శాశ్వత భవనాలు లేని వైనం 

మారుమూల ప్రాంతాల్లో తెరవని తలుపులు

బాలింతలు,చిన్న పిల్లలకు సక్రమంగా అందని పోషకాహారం 

విజిలెన్స్‌ దాడుల్లో ఆసక్తికర విషయాలు వెల్లడి

సాక్షి, అమరావతి బ్యూరో: అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు తిష్ట వేశాయి. మౌలిక సౌకర్యాలు పూర్తిగా కొరవడ్డాయి. పలు కేంద్రాలు కనీసం విద్యుత్‌ సౌకర్యానికి కూడా నోచుకోలేదు. ఇరుకు గదులు, రేకుల షెడ్డులో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పౌష్టికాహారం పలు కేంద్రాల్లో సక్రమంగా అందటం లేదు. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా  కొరవడింది. అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్‌లు 15 రోజుల కొకసారి తనిఖీ చేయాలి. సీడీపీఓలు రెండు నెలలకొక సారి తనిఖీ నిర్వహించాలి.

 వీరు అంగన్‌వాడీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవటంతో మారుమూల ప్రాంతాల్లో అంగన్‌ వాడీ కేంద్రాలు తెరుచుకోవటం లేదు. అంగన్‌ వాడీ కేంద్రాల వద్ద తయారు చేసే ఆహారం  పరిశుభ్రత లోపించింది. సామగ్రి నిల్వ చేసుకొనేందుకు సరైన  సౌకర్యాలు కేంద్రాల్లో ఉండటం లేదు.  జిల్లావ్యాప్తంగా విజిలెన్స్‌  ఎస్పీ శోభామంజరి ఆధ్వర్యంలో ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. మొత్తం 13 కేంద్రాలను పరిశీలించగా వాటిలో రెండు కేంద్రాలు అసలు తెరవలేదు. రెండు కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం లేదని గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం లోపించింది. మరుగుదొడ్ల  సౌకర్యం లేదు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అందని సేవలు
మాతా, శిశు మరణాలను తగ్గించటంలో భాగంగా, అంగన్‌వాడీలలో గర్భవతులకు  పౌష్టికాహారంతో పాటు 200 మిల్లీలీటర్ల పాలు,  అన్నం పప్పు, కూరగాయలతో కూడిన భోజనం కోడిగుడ్డు అందించాలి.  ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భవతులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి, వారిని చైతన్యపరచాలి. బాలింతలు ఆరు నెలల వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, పౌష్టికాహారం వంటి వాటిపై  సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్య పరచాలి. ఈ కార్యక్రమాలు అంగన్‌వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు కావటం లేదు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు మినీ భోజనంతో పాటు, 100 మిల్లీ గ్రాములు, ప్రతిరోజు ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. 

3–6 సంవత్సరాల పిల్లలకు 100 మిల్లీ గ్రాముల పాలు, 50 గ్రాముల బాలామృతం ఇవ్వాలి. గర్భిణులు, బాలింతలు, రక్త హీనత లేకుండా రాగి జావ, చిక్కి వంటివి అందజేయాలి.బరువు తక్కువగా ఉన్న పిల్లలకు గోరుముద్దల  ద్వారా అదనపు ఆహారం అందివ్వాలి. చాలా కేంద్రాల్లో కోడిగుడ్లు సరిగా పంపిణీ కావడం లేదనే ఆరోపణలు, పౌష్టికాహారం సరిగా అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గర్భిణులు, బాలింతలను చైతన్యం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో సమావేశాలు సక్రమంగా జరగటం లేదు. పలు కేంద్రాల్లో అంగన్‌ వాడీ కేంద్రాల్లో  స్టాకుల్లో తేడాలు ఉన్నట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో  బయటపడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరుపట్టికలో సైతం తేడాలు ఉన్నట్టు గుర్తించారు. పిల్లలు హాజరు తక్కువగా ఉన్నా,  పూర్తి స్థాయిలో అందరూ హాజరు అయినట్టు చూపుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిస్తున్నాం
సంక్షేమ పథకాలు సక్రమంగా పేద ప్రజలకు అందేలా చేయడంలో విజిలెన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ కీలక భూమిక పోషిస్తోంది. ఇందులో భాగంగా సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లు, స్కూళ్లను తనిఖీ చేశాం. వారంలోపు పూర్తయ్యే  చిన్న,చిన్న పనులు వెంటనే జరిపించేలా కృషిచేశాం. మళ్లీ వారం రోజుల తరువాత వెళ్లి, పరిస్థితిలో మార్పు వచ్చిందా..లేదా అనేది పరిశీలిస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు సక్రమంగా అమలు కావటం లేదు. ఈవిషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం .
–శోభామంజరి, విజిలెన్స్, ఎస్పీ, గుంటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top