ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగని దోపిడీ | Private hospitals incessant exploitation | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగని దోపిడీ

Oct 19 2013 5:17 AM | Updated on Sep 1 2017 11:45 PM

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి అంతు లేకుండా పోతోంది. రోగులకు సరైన వైద్యాన్ని అందించకుండానే రూ.లక్షల బిల్లులు వసూలు చేస్తున్నారు.

కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీకి అంతు లేకుండా పోతోంది. రోగులకు సరైన వైద్యాన్ని అందించకుండానే రూ.లక్షల బిల్లులు వసూలు చేస్తున్నారు. రోగుల ప్రాణాలను కాపాడకుండానే డబ్బులు గుంజుతున్నారు. శుక్రవారం కోర్టు చౌరస్తాలోని ఓ ఆసుపత్రిలో సిరిసిల్లకు చెందిన బొద్దున సోమనాథం(70) అనే రోగి చికిత్స పొందుతూ మృతిచెందా డు. రోగి ప్రాణాలకేమీ ప్రమాదం లేదన్న వైద్యులు ఆయన వైద్యానికి రూ.2,32,750 బిల్లు వేసి, ప్రాణాన్ని కాపాడలేకపోయారు. దీంతో ఆయన భార్య కళావతి, కొడుకు అశోక్ కన్నీరు మున్నీరుగా విలపించారు.
 
 వారి కథనం ప్రకారం.. సోమనాథం ఈ నెల 7వ తేదీన ఉన్నట్టుండీ కిందపడిపోయాడు. సిరిసిల్లలోని ఆసుపత్రిలో చూపించగా, పరిస్థితి విషమంగా ఉంద ని సదరు ఆసుపత్రికి రెఫర్ చేశారు. రూ.10వేలు అడ్వాన్స్ ఇవ్వనిదే రోగిని చేర్చుకోలేదు. అనంతరం పరీక్షలు నిర్వహించి, బీపీ ఎక్కువయి, తలలో నాడీ వ్యవస్థ దెబ్బతిందని, ఆపరేషన్ చేస్తేగానీ సోమనాథం బతకడని మరో రూ.50వేలు అడ్వాన్స్ తీసుకున్నారు. అయినా ఆపరేషన్ చేయకుండా రెండు రోజులు కాలయాపన చేశారు. ఇదేమని ప్రశ్నించిన బంధువులకు రక్తం సమకూర్చుకోవాలని సమాధానం చెప్పారు.
 
 దీంతో వారు రక్తం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగానే సోమనాథానికి ఆపరేషన్ చేసినట్లు వైద్యులు చెప్పారు. దీంతో బంధువుల్లో అనుమానాలు తలెత్తాయి. ఆపరేషన్  చేసే ముందు తలవెంట్రుకుల తొలగించకుండానే చిన్నగా ప్లాస్టర్ వేసి ఆపరేషన్ చేశామని నమ్మించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌తో ఐసీయూలో ఉంచారు. వారం రోజులు గడిచినా రోగి కనీసం కళ్లు కూడా తెరవలేదు. ఎప్పుడు కళ్లు తెరుస్తారని అడిగిన ప్రతిసారీ మందులు రాస్తూ తెప్పిస్తూ బిల్లు కట్టాలని వేధించారు. చివరికి శుక్రవారం ఉదయం 11 గంటలకు రోగి  మరణించాడని, మిగితా రూ.1.70లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకుపోవాలని, లేకుంటే శవాన్ని కదిలించేది లేదని ఇబ్బందులకు గురిచేశారు. ఆసుపత్రుల్లో  కనీస వసతులు, సరైన వైద్యులు అందుబాటులో లేకపోయినా రోగులను చేర్చుకుంటున్నారు. వైద్యులమనే మాటను మరిచి సంపాదనే ధ్యేయంగా దోపిడీకి తెగబడుతున్నారు. రూ.లక్షలు గుంజుతూ ప్రాణాలను హరిస్తూ, శవాలను అప్పగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement