పనుల్లేవ్.. పస్తులే | Plenty of funds to the district under the employment guarantee scheme but no work | Sakshi
Sakshi News home page

పనుల్లేవ్.. పస్తులే

Jan 18 2014 2:54 AM | Updated on Sep 5 2018 8:24 PM

ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు నిధులు పుష్కలంగా ఉన్నారుు. కానీ పనులు దొరక్క.. పనులు చేసినా వేతనాలు అందక కూలీలు పస్తులు ఉంటున్నారు.

ఏలూరు, న్యూస్‌లైన్ : ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు నిధులు పుష్కలంగా ఉన్నారుు. కానీ పనులు దొరక్క.. పనులు చేసినా వేతనాలు అందక కూలీలు పస్తులు ఉంటున్నారు.  2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ పథకంలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకూ రూ.70 కోట్ల విలువైన పనులను పూర్తి చేసినట్టుగణాంకాలు వెల్లడిస్తున్నారుు.  

 రెండు నెలలే గడువు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి సుమారు రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. ఇంకా రూ.50 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉంది. ఇందిర జలప్రభ పథకం కింద బోరుబావుల ఏర్పాటు, వాటికి విద్యు త్ సౌకర్యం, నిర్మల్  భారత్ అభియాన్ కింద 60వేల మరుగుదొడ్ల  నిర్మాణం వంటి పనులను కూడా ఇందులో చేర్చారు.

 తూడు తొలగింపు, ఎస్సీ, ఎస్టీ రైతుల పొలాల చదును, ఉద్యాన పంటల అభివృద్ధి తదితర 26 రకాల పనులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది. ఇవేమీ ముందుకు సాగటం లేదు. దీంతో రానున్న రోజుల్లో ఉపాధి పనులు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో అర్థంకాక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

 100 రోజుల పని‘కల్పనే’ :  ఈ పథకం ద్వారా కూలీలకు 100 రోజులు పని కల్పించాలని చట్టం చెబుతోంది. గతేడాది 12,106 మందికి 100 రోజులు పని దినాలు కల్పించగా, ఈ ఏడాది 4,039 మందికే ఆ అవకాశం కలిగింది. గత ఏడాది సగటున ఒక్కొక్క కూలీకి రూ.107.08 కూలి లభించగా, ఈ ఏడాది కాస్త పెరిగి రూ.111.69 చొప్పున లభించింది. ఎస్సీ, ఎస్టీలతో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో 3.60 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా, ఈ ఏడాది రూ.2.9 లక్షల మందికి జాబ్ కార్డులిచ్చి సరిపెట్టారు.

 వేతనాలు అందక అల్లాడుతున్న కూలీలు
 జిల్లాలో 74,465 మందికి కూలీలకు వేతనాల కింద రూ.6.58 కోట్లను అధికారులు చెల్లించాల్సి ఉంది. స్మార్ట్‌కార్డు ద్వారా ఫినో సంస్థ ఆధ్వర్యంలో వేతనాలు చెల్లించేవారు. ఈ విధానంలో పెద్దఎత్తున అవకతవకలు, వేతనాలు చెల్లింపులో జాప్యం అవుతున్నాయనే కారణాలతో అధికారులు ఆ సంస్థతో తెగతెంపులు చేసుకున్నారు. దీంతో పనులు చేసిన కూలీలకు ఆరు నెలలుగా వేతనాలు నిలిచిపోయూరుు. ఈ నెల 10వ తేదీ తర్వాత నుంచి పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు చేస్తామని చెప్పినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. వేతనాల కోసం సుమారు 75వేల మంది కూలీలు ఎదురు చూస్తున్నారు.

 వారం రోజుల్లో ఇస్తాం : డ్వామా పీడీ
 ఉపాధి కూలీలకు బకారుుల చెల్లింపు విషయమై డ్వామా ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎన్.రామచంద్రారెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, 22 మండలాల పరిధిలోని కూలీలకు రూ.2.35 కోట్లను వారం రోజుల్లో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. మిగిలిన 24 మండలాల్లోని కూలీలకు త్వరలోనే వేతన బకారుులు చెల్లిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement