కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆధారంగా రాష్ట్ర విభజనపై ముందుకెళ్లకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆధారంగా రాష్ట్ర విభజనపై ముందుకెళ్లకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజనకు సంబంధించి తదుపరి చర్యలేవీ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ విశాఖపట్నం నివాసైన రిటైర్డ్ ఉద్యోగి డి.సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లా గార్ల మండలానికి చెందిన సర్పంచులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోం, న్యాయ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం తొందరపాటుతో రాష్ట్ర విభజనకు చర్యలు తీసుకుంటోందని పిటిషనర్లు పేర్కొన్నారు. విభజన వల్ల కలిగే కష్టనష్టాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజన దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగా మంత్రుల బృందం (జీవోఎం) ఏర్పాటైందని, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇది పనిచేస్తోందని వివరించారు.