బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Perni Nani Speech At Machilipatnam - Sakshi

సాక్షి, మచిలీపట్నం: బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. ఈడేపల్లిలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పేర్ని నాని మాట్లాడుతూ తనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అండగా ఉండబట్టే రాజకీయంగా ఎదగగలిగానన్నారు. తన తండ్రి పేర్ని కృష్ణమూర్తితో పాటు తాను కూడా ఎక్కువగా ఈ వర్గాలతోనే మమేకమై పనిచేస్తున్నానన్నారు. బీసీలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఆర్‌.కృష్ణయ్య స్ఫూర్తితో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఆర్‌.కృష్ణయ్య కలసి బీసీ వర్గాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయాలని కోరడంతో ఈ పథకాన్ని ఈ వర్గానికి అమలు చేశారన్నారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ ఎన్నికలైన రెండు నెలల్లోనే బలహీనవర్గాలకు బడ్జెట్‌ సమావేశాల్లో 50 శాతం చట్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఈ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తొలుత జ్యోతీరావుపూలే, బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, బీసీ నాయకుడు బుల్లయ్య తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో విజయవాడ మాజీ డెప్యూటీ మేయర్‌ అరవ సత్యం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేకుబోయిన సుబ్రహ్మణ్యం,  బీసీ నాయకులు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top