వేసవికి ముందే జిల్లా రాజకీయం వేడెక్కింది. మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
సాక్షి, అనంతపురం : వేసవికి ముందే జిల్లా రాజకీయం వేడెక్కింది. మున్సిపల్, లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓటరు నాడి పసిగట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. సహకార, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్‌ఆర్‌సీపీ త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా హవా పైచేయి సాధించే దిశగా పయనిస్తోంది. రాష్ట్ర విభజనకు ప్రత్యక్షంగా సహకరించిన కాంగ్రెస్, పరోక్షంగా సహకరించిన తెలుగుదేశం పార్టీలు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జట్టు పీక్కుంటున్నారు.
కొన్ని మున్సిపాల్టీలో ఈ రెండు పార్టీలకు అభ్యర్థులు దొరకడమే గగనంగా మారింది. పదవుల కోసం పోటీ పడాల్సిన వేళ కాంగ్రెస్ నాయకులు, తెలుగు తమ్ముళ్లు చతికిలపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలీని పరిస్థితి నెలకొంది. బరిలో నిలిపే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు భరిస్తామని చెబుతున్నా ‘మీ డబ్బూ వద్దు.. టికెట్లు వద్దు’ అంటూ వెనకడుగు వేస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా కార్పొరేషన్‌తో పాటు నాలుగైదు మున్సిపాల్టీల్లో ఎన్నికల బాధ్యతలు తీసుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ నుంచి నాయకులు ముందుకు రావడం లేదు.
వైఎస్‌ఆర్‌సీపీలో పోటీ..
మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. ఎలాగైనా టికెట్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. టికెట్ ఇస్తే చాలు.. గెలిచి వస్తాం అంటూ నాయకుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, రాయదుర్గం, ధర్మవరం ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోని నేతలు ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజల్లో ఆదరణ ఉండడంతో జనం నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజాసేవ చేసే వారినే ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
కాంగ్రెస్ ఖాళీ..
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది. మున్సిపల్ బరిలో నిలిచే వారే కరువయ్యారు. అభ్యర్థుల ఎంపిక గురించి కూడా ఏ నాయకుడూ పట్టించుకోని పరిస్థితి ఉంది. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నాయకుడు లేకుండా పోయాడు.
మారూ. మంత్రి శైలజానాథ్ సైతం కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమైనట్లు తెలియడంతో సగం కాంగ్రెస్ కేడర్ పార్టీకి గుడ్‌బై చెప్పేసింది. హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో మారూ. మంత్రి రఘువీరారెడ్డి కూడా జిల్లాలో తన హవాను చాటుకోలేకపోతున్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా డీసీసీ అధ్యక్షుడి పదవికి రారూ.నామా చేసి విభజన విషయంలో అధిష్టానంపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని గుంతకల్లు మున్సిపాల్టీ, గుత్తి, పామిడి నగర పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపికపై గురించి ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు.
జేబులు ఫుల్‌గా ఉంటే ఎవరైనా కాంగ్రెస్ నుంచి మున్సిపల్ బరిలో నిలబడొచ్చని, తమ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఉండదని ఇప్పటికే కొట్రికె స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కాస్తోకూస్తో ఉన్న ఆశావహులు సైతం ‘ఎలాగూ ఓడిపోతాం..అంతమాత్రానికి డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలి’ అని మిన్నకుండి పోతున్నారు. ఇక కదిరిలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా చెప్పుకున్న డాక్టర్ బత్తల వెంకటరమణ పత్తాలేకుండా పోయారు. డీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిద్దారెడ్డి పార్టీలోనే ఉన్నా మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదని భావిస్తున్నారు. రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కూమొక్కూ లేదు.
టీడీపీలో ముదురుతున్న వర్గపోరు..
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో సైకిల్ స్పీడ్ తగ్గిపోవడమే కాకుండా తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. జేసీ సోదరుల చేరికకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీలో వర్గపోరు మరింత ముదిరింది. నాయకులు ఎవరికి వారే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనికి సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ రావడం అనుమానంగా ఉండడంతో ప్రస్తుతం ఆయన స్తబ్దుగా ఉన్నారు. ఇటీవలే కాంగ్రెస్ గోడ దూకి సైకిల్ ఎక్కిన అంబికా లక్ష్మినారాయణకు సైతం అసెంబ్లీ టికెట్ విషయంలో బాబు నుంచి ఎలాంటి హామీ లభించకపోవడవంతో ఆయన కూడా మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ధర్మవరంలో వర్గ పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆయా మున్సిపాల్టీల్లో ఎన్నికలకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయంలో ఇరువురూ ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన విషయంలో అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాతం అవలంభించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని తెలుసుకునే వారీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.