నగర, పురపాలక ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలపై పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
సాక్షిప్రతినిధి, అనంతపురం : నగర, పురపాలక ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలపై పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణలు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
పత్యర్థులకు దీటుగా నిలిచే అభ్యర్థుల కోసం సర్వేల బాట పట్టారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాల్టీలు, ఐదు నగర పంచాయతీలకు ఈనెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నగర, పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి శాసనసభ స్థానాలతో పాటు అనంతపురం, హిందూపురం లోక్‌సభ స్థానాలపై కూడా ఉంటుంది.
పురపాలక ఎన్నికలు రాజకీయపార్టీల గుర్తుల ఆధారంగా నిర్వహించినా.. స్థానిక పరిస్థితులు, అభ్యర్థిత్వం, సామాజిక సమీకరణలు అధిక ప్రభావితం చూపుతాయి. ఇటీవల రాజకీయపార్టీల గుర్తులతో నిమిత్తం లేకుండా నిర్వహించిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించనుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం తొణికిసలాడుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని 12 నగర, పురపాలక సంస్థల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వైఎస్సార్‌సీపీ కసరత్తు చేస్తోంది. ఆశావహులు అధికంగా ఉండటంతో మెరుగైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఇక పంచాయతీ, సహకార ఎన్నికల్లో ఓటమితో నైతిక స్థైర్యం దెబ్బతిన్న టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులను పురపాలక ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఆ పార్టీల నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించడం వల్లే సహకార, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయామని కుంటిసాకులు చెబుతూ.. పురపాలిక ఎన్నికలకు శ్రేణులను కాంగ్రెస్, టీడీపీ నేతలు సన్నద్ధం చేస్తున్నారు. పురపాలక ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోగానే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతే.. సార్వత్రిక ఎన్నికల్లో తమ చిరునామా గల్లంతవుతుందని ఆ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం సర్వేల బాట పట్టారు. పురపాలక ఎన్నికల్లో విజయం తమ కన్నా శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులకే ఎక్కువ ప్రతిష్ఠాత్మకమని భావించిన ఆశావహులు తడాఖా చూపిస్తున్నారు. ‘మా వద్ద రూపాయి లేదు.. మీరు పార్టీ ఫండ్‌గా డబ్బులు ఇస్తేనే ఎన్నికల్లో నిలబడతాం’ అంటూ టీడీపీ, కాంగ్రెస్ నేతలకు ఆశావహులు షరతులు పెడుతున్నారు. దీంతో శాసనసభ, లోక్‌సభ టికెట్లు ఆశిస్తోన్న టీడీపీ, కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తుతున్నారు.