చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా?
వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు కన్నబాబు
19 తరువాత బాధ్యతల స్వీకరణ
అన్నవరం: చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఆయనను ఎప్పుడు గద్దెదింపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన కురసాల కన్నబాబు అన్నారు. ఆయన ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం, పార్టీ అంతర్గతంగా చాలా బలహీనంగా ఉన్నందునే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకుంటున్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడినంత మాత్రాన పార్టీ బలహీనపడినట్టు కాదన్నారు.
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాలలో కూడా 90 శాతానికి పైగా కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు. కాకినాడ కార్పొరేషన్, స్థానికసంస్థల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, జిల్లాలోని పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకొని ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని కన్నబాబు అన్నారు.
జగన్‌తో సమావేశమయ్యాక బాధ్యతల స్వీకరణ
పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమవుతున్నట్టు కన్నబాబు తెలిపారు. ఆ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే తేదీని నిర్ణయిస్తానన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతానని ఆయన తెలిపారు. కన్నబాబు వెంట పార్టీ నాయకులు కొమిలి సత్యనారాయణ, కొత్తా రవి, అన్నవరం టౌన్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రాయవరపు భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి అప్పారావు, సరమర్ల మధుబాబు, రాయి శ్రీనివాస్, పార్టీ నాయకులు బీఎస్‌వీ ప్రసాద్, దడాల సతీష్, బత్తుల రవికుమార్ తదితరులు ఉన్నారు.